నోట్లు స్థానంలో డిజిటల్ కరెన్సీ.. సొంత కరెన్సీని తీసుకువస్తున్న భారత్ .. పూర్తి వివరాలు ఇవే..
భారతదేశం త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మద్దతుతో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఖతార్‌లోని దోహా పర్యటనలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ కీలక విషయాన్ని ప్రకటించారు. ఈ కొత్త డిజిటల్ కరెన్సీ సాంప్రదాయ కరెన్సీ లాగానే RBI హామీతో ఉంటుందన్నారు. అయితే పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని తెలిపారు.
కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. digital currency లావాదేవీలను వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా చేయడం లక్ష్యంగా ఉంది. ఇది కాగితం వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా మార్చగలదని గోయల్ పేర్కొన్నారు. GENIUS చట్టం కింద యునైటెడ్ స్టేట్స్‌లో ప్రవేశపెట్టిన స్థిరమైన నాణేలతో పోల్చితే..భారతీయ డిజిటల్ కరెన్సీ వివిధ లావాదేవీలను సులభతరం చేస్తుందన్నారు. అలాగే వేగవంతం చేస్తుందని వ్యవహారాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుందని పియూష్ గోయెల్ తెలిపారు.

భారతదేశం తన సొంతంగా తీసుకువస్తున్న డిజిటల్ కరెన్సీ వ్యవస్థ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది, ఇది పారదర్శకత, ట్రేసబిలిటీని నిర్ధారిస్తుంది. ప్రతి లావాదేవీ వ్యవస్థలో ఇది ధృవీకరించబడుతుంది. కాబట్టి అక్రమ లావాదేవీలను అరికట్టడంలో ఇది సహాయపడుతుంది. దీనివల్ల వినియోగదారులు భద్రతతో లావాదేవీలు జరపగలుగుతారు. ఆర్థిక వ్యవస్థలో సమగ్రత నిల్వచేయబడుతుంది.
పియూష్ గోయల్ స్పష్టం చేసినట్లుగా.. భారత డిజిటల్ కరెన్సీ ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలతో పోల్చి భిన్నంగా ఉంటుంది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు, ఉదాహరణకు బిట్‌కాయిన్ ఏ విధమైన అధికారిక హామీ లేకుండా మార్కెట్ డిమాండ్ ఆధారంగా విలువను పొందుతాయి. ఏ విలువకు హామీ ఇచ్చే బ్యాకెండ్ లేదని మంత్రి పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వం సేవలను ప్రోత్సహించదు కానీ పన్ను విధిస్తుందన్నారు. అంటే ఈ ఆస్తులను ఉపయోగించడం వినియోగదారుడి బాధ్యతలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే.. భారత డిజిటల్ కరెన్సీ ప్రారంభం అయిన తర్వాత లావాదేవీలు మందకొడిగా గాకుండా, సురక్షితంగా జరుగుతాయి.అలాగే కాగితం వినియోగం తగ్గుతుంది. దీంతో పాటుగా బ్యాంకింగ్ ఖర్చులు తగ్గుతాయి. RBI మద్దతు వలన వినియోగదారులకు భద్రత, విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. అక్రమ లావాదేవీలను అరికట్టడం, ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా ఉంచడం సులభమవుతుంది.
భారత డిజిటల్ కరెన్సీకి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు తేడా ఏంటంటే.. భారత డిజిటల్ కరెన్సీకి RBI మద్దతు, అధికారిక హామీ, భద్రత, పారదర్శకత ఉంటుంది. ఇక ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు ఎటువంటి ప్రభుత్వ హామీ ఉండదు, మార్కెట్ ఆధారిత విలువ, అధిక రిస్క్ ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ RBI-బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీ భారత ఆర్థిక వ్యవస్థలో సమగ్రత, భద్రత, వేగవంతమైన లావాదేవీలతో కూడి ఉంటుంది. అలాగే కాగితం వినియోగం తగ్గింపు వంటి ప్రయోజనాలను తెస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల ప్రమాదాలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications