New rules: ఇకపై OTP లేకుండానే డబ్బులు కట్ అవుతాయా? ఈ కొత్త రూల్స్ తెలియకపోతే ఇబ్బందే!
మీరు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ వాడుతున్నారా? లేదా ప్రతి నెలా కరెంట్ బిల్లులు, మ్యూచువల్ ఫండ్ SIPలు ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి కట్ అవుతున్నాయా? అయితే మీకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. పెరిగిపోతున్న డిజిటల్ మోసాలను అరికట్టడంతో పాటు, కస్టమర్లకు సులభమైన పేమెంట్ అనుభవాన్ని అందించడమే ఈ కొత్త రూల్స్ (New rules) ముఖ్య ఉద్దేశ్యం. 'డిజిటల్ పేమెంట్స్ - ఈ-మాండేట్ ఫ్రేమ్‌వర్క్ 2026' పేరుతో వచ్చిన ఈ మార్పుల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 15,000 వరకు OTP అవసరం లేదు!
సాధారణంగా ప్రతి చిన్న ట్రాన్సాక్షన్‌కు మనం OTP ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకపై రూ. 15,000 వరకు ఉండే రికరింగ్ పేమెంట్లకు (ప్రతి నెలా జరిగే చెల్లింపులు) మాటిమాటికీ OTP అడగదు. ఒకసారి మీరు పిన్ లేదా OTP ద్వారా 'ఈ-మాండేట్' రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి. OTT సబ్‌స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, EMIలు , కరెంట్ బిల్లులకు ఇది వర్తిస్తుంది.
కొన్నింటికి రూ. 1 లక్ష వరకు వెసులుబాటు!
మరింత ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు , క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల కోసం ఈ పరిమితిని ఏకంగా రూ. 1 లక్ష వరకు పెంచారు. అంటే ఈ కేటగిరీలలో మీరు ఒకసారి పర్మిషన్ ఇస్తే, లక్ష రూపాయల వరకు OTP లేకుండానే ఆటోమేటిక్‌గా పేమెంట్ జరిగిపోతుంది. అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే మాత్రం ఖచ్చితంగా OTP ఎంటర్ చేయాల్సిందే.
డబ్బులు కట్ అయ్యే 24 గంటల ముందే అలర్ట్!
చాలామందికి తమ ఖాతా నుంచి డబ్బులు ఎప్పుడు కట్ అవుతాయో తెలియదు. అందుకే RBI ఒక కఠినమైన రూల్ పెట్టింది. ఏదైనా ఆటో-డెబిట్ ట్రాన్సాక్షన్ జరిగే కనీసం 24 గంటల ముందే బ్యాంకు లేదా పేమెంట్ ప్రొవైడర్ మీకు SMS లేదా ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపాలి. ఇందులో ఎంత డబ్బు కట్ అవుతుంది, ఎవరికి వెళ్తుంది అనే వివరాలు ఉండాలి. దీనివల్ల మీకు ఆ పేమెంట్ వద్దు అనుకుంటే, దానిని ఆపేందుకు లేదా మార్చేందుకు సమయం ఉంటుంది.
మీ ఖాతాపై మీకే పూర్తి కంట్రోల్!
ఈ కొత్త విధానంలో కస్టమర్లకే సర్వ హక్కులు కల్పించారు. మీ బ్యాంక్ యాప్ ద్వారా ఏప్పుడైనా ఈ-మాండేట్‌ను ఆపవచ్చు (Pause), మార్చవచ్చు (Modify) లేదా పూర్తిగా రద్దు చేయవచ్చు (Cancel). ముఖ్యంగా కరెంట్ బిల్లుల వంటి వాటికి గరిష్ట పరిమితిని (Maximum Limit) కూడా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు తెలియకుండా ఎక్కువ అమౌంట్ కట్ అయ్యే ఛాన్స్ ఉండదు.
వాలెట్స్.. సేఫ్టీ ఫీచర్లు..
డిజిటల్ వాలెట్స్ (PPIs) వాడుతున్న వారి కోసం కూడా కొత్త పరిమితులు వచ్చాయి..
- వాలెట్ గరిష్ట బ్యాలెన్స్: రూ. 2 లక్షలు.
- నగదు లోడింగ్ పరిమితి: నెలకు రూ. 10,000.
- గిఫ్ట్ కార్డ్ లిమిట్: రూ. 10,000.
అంతేకాకుండా, ఈ సేవల కోసం బ్యాంకులు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. ఒకవేళ ఏదైనా అనధికారిక లావాదేవీ జరిగితే, మీరు వెంటనే రిపోర్ట్ చేస్తే 'జీరో లయబిలిటీ' రక్షణ ఉంటుంది. అంటే మీ తప్పు లేకుండా పోయిన డబ్బును బ్యాంకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద చూస్తే, ఈ కొత్త రూల్స్ (New rules) వల్ల పేమెంట్లు ఈజీగా అవ్వడమే కాకుండా, మన డబ్బుకు మరింత భద్రత లభిస్తుంది.


Click it and Unblock the Notifications