2019-20(జూలై-జూన్) ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్లను డివిడెండ్‌గా చెల్లించనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). ఈ మేరకు గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపారు. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ఆర్బీఐ సహా ఇతర ఆర్థిక సంస్థల నుండి ఈసారి రూ.60వేల కోట్ల మేర వస్తాయని బడ్జెట్‌లో కేంద్రం అంచనా వేసింది.

కమిటీ సిఫార్సులు.. అదనపు కేటాయింపులు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన 584వ సమావేశంలో కేంద్రానికి ఇవ్వనున్న డివిడెండ్‌పై నిర్ణయం తీసుకున్నారు. అలాగే అకస్మిక అవసరాలకు గాను తన మొత్తం బ్యాలెన్స్ షీట్‌లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్ బఫర్‌ను కొనసాగించాలని కూడా బోర్డు సమావేశం నిర్ణయించింది. అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ కేంద్రానికి మొత్తం రూ.1.76 లక్షల కోట్లు చెల్లించింది. అందులో డివిడెండ్ రూపంలో మొత్తం రూ.1.23 లక్షల కోట్లు బదిలీ చేసింది. మిగులు నిల్వల నిర్వహణపై బిమల్ జలాన్ కమిటీ సిఫార్సుల్ని ఆమోదించిన తర్వాత అదనపు కేటాయింపుల కింద మరో రూ.52,637 కోట్లు చెల్లించింది.

మధ్యంతర డివిడెండ్
కరెన్సీ ట్రేడింగ్, బాండ్స్ ట్రేడింగ్ నుండి ఆర్బీఐ భారీగా ఆదాయం పొందుతుంది. ఇందులో తన కార్యకలాపాల కోసం కొంత ఉంచుకొని, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందిస్తుంది. ఇందులో భాగంగా గత ఏడాది రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించింది. నిధులులేని పరిస్థితుల్లో ఆర్బీఐపై ఆధారపడుతుంది కేంద్రం. ఇందులో భాగంగా కేంద్రం మధ్యంతర డివిడెండ్ కోరింది. అప్పుడు ఆర్బీఐ మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తుంది.

అంచనాలు మిస్
ఆర్బీఐ నుంచి రూ.60,000 కోట్ల డివిడెండ్ లభించవచ్చునని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత కష్టకాలంలో ఆర్బీఐ డివిడెండ్ చెల్లింపులు అంచనాల కంటే తగ్గడం గమనార్హం. కరోనా కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయింది. అదే సమయంలో ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఈసారి ద్రవ్యలోటు భారీగా పెరగనుందని అంచనా వేస్తున్నారు. కాగా, మాజీ గవర్నర్ ఉర్జీత్ పటేల్ హయాంలో ఆర్బీఐ, కేంద్రానికి మధ్య విభేధాలకు ప్రధాన కారణాల్లో మిగులు నిల్వల నిర్వహణ అంశం కూడా ఒకటి. ఈ నిల్వల సముచిత స్థాయిని నిర్ణయించేందు కోసం ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సిఫారసులను ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు గత ఏడాది ఆమోదించింది.


Click it and Unblock the Notifications