బ్యాంకుల్లో వెండి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా ప్రకటించిన నూతన నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రజలు తమ వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలరు. ఇప్పటివరకు కేవలం బంగారంపై మాత్రమే రుణాల సౌకర్యం లభించేది. అయితే 2026 ఏప్రిల్ 1 నుండి ఈ అవకాశాన్ని వెండిపైనా విస్తరించనున్నట్లు తెలిపింది RBI.
RBI జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, నియంత్రిత NBFCలు వెండిపై రుణాలు ఇవ్వగలవు. ఇది బంగారు రుణ విధానంలాగే పనిచేస్తుంది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. రుణగ్రహీతలు తమ వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలు పొందవచ్చు. అయితే, వెండి ఇటుకలు (bars) లేదా వెండి కడ్డీలు రుణాలకు అర్హత పొందవని RBI స్పష్టం చేసింది. అదేవిధంగా ETFలు లేదా మ్యూచువల్ ఫండ్లు వంటి వెండి ఆధారిత పెట్టుబడులు కూడా ఈ పథకంలో భాగం కావు.

కొత్త నియమాల ప్రకారం.. వ్యక్తులు గరిష్టంగా 10 కిలోగ్రాముల వెండిని తాకట్టు పెట్టి రుణం పొందవచ్చు. ఉదాహరణకు, రూ. 2.5 లక్షల విలువైన వెండిని తాకట్టు పెడితే, దాని విలువలో 85 శాతం వరకు రుణం పొందవచ్చు. అయితే రూ. 5 లక్షల విలువైన వెండి తాకట్టు పెడితే LTV (Loan-to-Value) నిష్పత్తి 75 శాతం వరకు పరిమితం అవుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వెండి ఆస్తులు కలిగిన కుటుంబాలకు పెద్ద సహాయంగా మారనుంది. బంగారం లేని వారు ఇప్పుడు తమ వెండిని ఉపయోగించి అత్యవసర సమయాల్లో నిధులు సేకరించగలుగుతారు.
రుణగ్రహీత రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత, బ్యాంకులు లేదా NBFCలు తాకట్టు పెట్టిన వెండి లేదా బంగారాన్ని ఏడు పని దినాలలోపు తిరిగి ఇవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే, ప్రతి ఆలస్యం చేసిన రోజుకు రూ.5,000 వరకు జరిమానా విధించబడుతుంది. రుణగ్రహీత చెల్లింపులో డిఫాల్ట్ అయితే..బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ తనఖా పెట్టిన వెండి లేదా బంగారాన్ని విక్రయించి బకాయిలను తిరిగి పొందవచ్చు.
RBI ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలో సురక్షిత రుణ ఎంపికలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. వెండి సాధారణంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాల్లో విస్తృతంగా ఉండే లోహం. కాబట్టి, ఈ నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని పెంచి, ఫార్మల్ బ్యాంకింగ్ రంగానికి మరింత మంది చేరేందుకు మార్గం సుగమం చేస్తుంది. అలాగే బంగారం ధరలు అధికంగా ఉండడం వల్ల చాలా మందికి బంగారు రుణం సాధ్యంకాకపోవచ్చు. అలాంటి వారికీ వెండి రుణాలు తక్షణ ఆర్థిక ఉపశమనం అందించగలవు.
RBI ప్రవేశపెట్టిన వెండి రుణ విధానం భారతీయ రుణ రంగంలో ఒక పెద్ద మలుపు. 2026 ఏప్రిల్ నుండి వెండి ఆభరణాలు లేదా నాణేలు కలిగిన వ్యక్తులు తమ విలువైన ఆస్తులను ఉపయోగించి తక్కువ వడ్డీతో రుణాలు పొందవచ్చు. ఇది గ్రామీణ భారతదేశంలో ఆర్థిక చేర్పును పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన నిధుల అందుబాటును నిర్ధారిస్తుంది.


Click it and Unblock the Notifications