కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక భారం ఎదుర్కొంటున్న సంస్థలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం కీలక ప్రకటన చేసింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఆరు మ్యూచువల్ ఫండ్ స్కీంలను క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా చాలామంది ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుంటుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్లోజ్ చేసినట్లు తెలిపింది. ఇబ్బందుల్లోని మ్యూచువల్ ఫండ్స్ ఆర్థిక స్థిరత్వం కోసం రూ.50,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని అందించాలని నిర్ణయించింది.
ఈ సదుపాయం ఈ రోజు నుండి మే 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ పైన లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్ కింద ఆర్బీఐ 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను స్థిర రెపో రేటుతో నిర్వహిస్తుంది. 2020 ఏప్రిల్ 27 నుండి 2020 మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తానికి అనుమతి ఉంది. సంబంధిత నిధులు పొందేందుకు సోమవారం నుండి శుక్రవారం వరకు బిడ్స్ సమర్పించవచ్చునని తెలిపింది. ఎస్ఎల్ఎఫ్-ఎంఎఫ్ కింద లభించే లిక్విడిటీ సపోర్ట్ హెచ్‌టీఎం పోర్ట్‌ఫోలియోలో చేర్చడానికి అనుమతించిన పెట్టుబడిలో 25% మించి మెచ్యూరిటీ ఉంటుందని తెలిపింది.

మార్కెట్లకు ఆర్బీఐ ఊతం
స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 27) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 544.57 పాయింట్లు లేదా 1.74% ఎగిసి 31,871.79 వద్ద, నిఫ్టీ 158.05 పాయింట్లు లేదా 1.73% పెరిగి 9,312.45 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత సెన్సెక్స్ 740 పాయింట్లకు చేరువైంది. 749 షేర్లు లాభాల్లో, 161 షేర్లు నష్టాల్లో ఉండగా, 35 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగాయి. మ్యూచువల్ ఫండ్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ.50,000 కోట్ల స్పెషల్ లిక్విడిటీని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టే అవకాశముందని వార్తలు వచ్చాయి. దీంతో మార్కెట్ జోరందుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా ఉంది.


Click it and Unblock the Notifications