వెండి ఆభరణాలపై బ్యాంక్ లోన్లు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన RBI.. ఎప్పటి నుంచి అంటే..
భారతీయుల కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల బంగారు రుణ నిబంధనలను మరింత సరళీకరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇప్పుడు వెండిని కూడా రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు, సాధారణ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి, తక్షణ ఆర్థిక అవసరాల సమయంలో పెద్ద ఊరట కలిగించనున్నాయి.
భారత రిజర్వ్ బ్యాంక్ (బంగారం, Silver రుణాలు) ఆదేశాలు, 2025 కింద విడుదల చేసిన ఈ మార్గదర్శకాల ఉద్దేశం విలువైన లోహాలపై ఇచ్చే రుణాల్లో స్పష్టత, పారదర్శకతతో దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయడమే. ఇప్పటివరకు వెండి మీద రుణాలు స్పష్టమైన నియమాల లేకుండా పరిమితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నిర్ణయంతో వెండి కూడా అధికారికంగా బ్యాంకింగ్ వ్యవస్థలో పూచీకత్తుగా గుర్తింపు పొందింది.

ఈ కొత్త నిబంధనలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తాయి. అంటే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రుణ సంస్థలు వెండి ఆధారంగా రుణాలు ఇవ్వగలుగుతాయి. దీంతో ప్రజలకు ఎంపికలు పెరగడమే కాకుండా, పోటీ కారణంగా సేవల నాణ్యత మెరుగుపడే అవకాశమూ ఉంది.
రుణాలకు అంగీకరించే వెండి లేదా బంగారం విషయంలో RBI స్పష్టమైన పరిమితులు విధించింది. ఆభరణాలు లేదా నాణేల రూపంలో ఉన్న బంగారం, వెండి మీద మాత్రమే రుణాలు ఇవ్వాలని పేర్కొంది. స్వచ్ఛమైన బంగారం లేదా వెండి కడ్డీలు, అలాగే గోల్డ్ లేదా సిల్వర్ ETFలు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి ఆర్థిక ఆస్తులపై రుణాలు ఇవ్వడానికి అనుమతి లేదు. తాకట్టు పరిమాణం కూడా పరిమితమే. బంగారు ఆభరణాలు ఒక కిలో వరకు, వెండి ఆభరణాలు పది కిలోల వరకు మాత్రమే అంగీకరిస్తారు. అలాగే బంగారు నాణేలు 50 గ్రాముల వరకు, వెండి నాణేలు 500 గ్రాముల వరకు మాత్రమే తాకట్టు పెట్టవచ్చు.
రుణం ఎంత వరకు లభిస్తుందనే విషయంలో RBI లోన్-టు-వాల్యూ (LTV) పరిమితులను కూడా ఖరారు చేసింది. రూ.2.5 లక్షల వరకు తీసుకునే రుణాలకు గరిష్టంగా 85 శాతం వరకు రుణం లభిస్తుంది. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం అయితే 80 శాతం, రూ.5 లక్షలకుపైగా అయితే 75 శాతం మాత్రమే అనుమతిస్తారు. ఉదాహరణకు, మీ వద్ద రూ.1 లక్ష విలువైన వెండి ఉంటే, దానిపై గరిష్టంగా రూ.85 వేల వరకు రుణం పొందవచ్చు.
వెండి లేదా బంగారం విలువను నిర్ణయించేందుకు గత 30 రోజుల సగటు ముగింపు ధర లేదా మునుపటి రోజు ముగింపు ధరలో తక్కువదాన్ని ఆధారంగా తీసుకుంటారు. ఈ ధరలు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) లేదా గుర్తింపు పొందిన కమోడిటీ ఎక్స్ఛేంజ్ రేట్ల ఆధారంగా ఉంటాయి. ఆభరణాల్లో ఉన్న రాళ్లు లేదా ఇతర లోహాల విలువను లెక్కలోకి తీసుకోరు.రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత లేదా సెటిల్ అయిన తర్వాత, తాకట్టు పెట్టిన ఆభరణాలను ఏడు పని దినాల లోపే తిరిగి ఇవ్వాలని RBI స్పష్టం చేసింది. బ్యాంకు లేదా రుణ సంస్థ తప్పిదం వల్ల ఆలస్యం జరిగితే, కస్టమర్‌కు రోజుకు రూ.5 వేలు చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications