RBI News: NBFCలకు రిజర్వు బ్యాంక్ కీలక సూచన.. కుప్పకూలిన Muthoot, Manappuram స్టాక్స్..
Muthoot - Manappuram: ఈరోజు మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో మణప్పురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు 8 శాతం క్షీణతను నమోదు చేశాయి. వాస్తవానికి ఈ పతనానికి కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా NBFC సంస్థల రుణాల పంపిణీలో నగదు పరిమితిని పరిమితం చేయాలని సలహా ఇస్తూ లేఖ రాసింది.
ఫైనాన్స్ సంస్థలు నగదు చెల్లింపుపై ఆదాయపు పన్ను చట్టం నిబంధనను ఖచ్చితంగా పాటించాలని రెండు ఎన్‌బీఎఫ్‌సీలను సెంట్రల్ బ్యాంక్ కోరినట్లు వెల్లడైంది. తాజాగా ఆర్బీఐ వీటిని నగదు రూపంలో రుణ వితరణలను రూ.20,000కు పరిమితం చేయాలని సూచించింది. దీనికంటే పెద్ద మెుత్తాలను నగదు రహిత మార్గాల్లో అందించాలని పేర్కొంది.

దేశంలో బంగారంపై రుణాలు అందించే కొన్ని పెద్ద NBFCలు నగదు పంపిణీపై స్పష్టత కోసం ఆర్బీఐని చేరుకున్న తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఈ సలహాను పంపింది. ఆర్బీఐ పర్యవేక్షణ విభాగం ప్రత్యేకంగా ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి గోల్డ్ లోన్ ఫైనాన్షియర్‌లకు పంపిందని వెల్లడైంది.
వాస్తవానికి దేశంలోని పెద్ద గోల్డ్ లోన్ పంపిణీ సంస్థలకు ఆర్బీఐ తాజా సలహా NBFCలు నిబంధనలకు కట్టుబడి ఉండమని ఒక హెచ్చరికగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి దీనికి ముందు మార్చి, 2024లో ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ బంగారు రుణాలను పంపిణీ చేయకుండా RBI నిషేధించి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రుణాల పంపిణీ విషయంలో గుర్తించిన అనేక లోపాలతో ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం మణప్పురం రుణ వితరణలు 40 శాతం నగదు రూపంలో, దాదాపు 56 శాతం బంగారు రుణ వ్యాపారం ఆన్‌లైన్‌లో జరుగుతుండగా, ముత్తూట్ 40 శాతం బంగారు రుణాలు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుగుతున్నట్లు పేర్కొంది. కొంత కాలం కంపెనీలపై ఆర్బీఐ చర్య ప్రభావం ఉంటుందని అంచనా వేసింది.
ఆర్బీఐ అడ్వైజరీపై ముతూట్ ఫైనాన్స్ ఎండీ స్పందించారు. రిజర్వు బ్యాంక్ చర్యలు తమ కంపెనీ వ్యాపారంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోవని పేర్కొన్నారు. తమ కస్టమర్లలో 80 శాతం మంది ఇప్పటికే నగదురహిత చెల్లింపు మార్గాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది బంగారు రుణాల వితరణ వ్యాపారంలో ఉన్న అన్ని సంస్థలకు వర్తిస్తుందన్నారు.
అయితే ఆర్బీఐ తాజా చర్యల వల్ల కొందరు కస్టమర్లు గ్రామీణ ప్రాంతాల్లో అసంఘటిత రుణదాతలను సంప్రదించవచ్చన్నారు. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో 1.23 గంటలకు ఎన్ఎస్ఈలో ముతూట్ ఫైనాన్స్ స్టాక్ ధర 2.73 శాతం నష్టంతో రూ.1,614 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మణప్పురం ఫైనాన్స్ స్టాక్ 6.64 శాతం నష్టంతో రూ.168.05 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications