Raymond Group: వైరల్ అవుతున్న రేమాండ్ ఛైర్మన్ సోషల్ మీడియా పోస్ట్..!
Gautam Singhania: దేశంలో ప్రముఖ టెక్స్ టైల్ బ్రాండ్ రేమాండ్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండి గౌతమ్ సింఘానియా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సారి దీపావళి తనకు మునుపటిలాగా లేదంటూ ఒక పోస్ట్ చేశారు.
రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా సోమవారం తన భార్య నవాజ్ మోదీ సింఘానియాతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు వివాహమై దాదాపు 32 ఏళ్లు పూర్తైంది. వీరికి నిహారిక, నిసా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ, నమ్మకంగా జీవితాన్ని కొనసాగించారు. అయితే ఇటీవలి కాలంలో తన జీవితంలో ఎదురైన కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆయన జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలపై రూమర్స్, గాసిప్స్ గురించి కూడా గౌతమ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం తన భార్య నవాజ్ మోదీ, తాను రెండు వేరువేరు మార్గాలను ఎంచుకున్నామని.. అందువల్లనే తమ వైవాహిక జీవితానికి ఇక్కడితో ముగింపు పలుకుతున్నట్లు పోస్ట్ లో రాశారు. అయితే తల్లిదండ్రులుగా తమ ఇద్దరు వజ్రాల్లాంటి పిల్లల ఉత్తమ భవిష్యత్తుకు అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.
తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించి అందరూ ఈ సమస్య నుంచి బయటపడేందుకు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొందరు కొనసాగిస్తున్న నిరాధారమైన పుకార్లను ఇకనైనా ఆపాలని కోరారు. అయితే ఫిట్‌నెస్ కోచ్ అయిన నవాజ్ మోదీ సింఘానియా దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.


Click it and Unblock the Notifications