Raymond: బిజినెస్ సీక్రెట్ చెప్పిన గౌతమ్ సింఘానియా.. రేమాండ్ ఇన్వెస్టర్లకు పండగే..
Bangladesh crisis: దేశీయ దుస్తువల వ్యాపారంలో దిగ్గజ సంస్థగా రేమాండ్ దశాబ్ధాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో వ్యక్తిగత జీవితంలోని గొడవలతో వార్తల్లో నిలిచిన గౌతమ్ సింఘానియా తాజాగా తన వ్యాపారానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస, రాజకీయ సంక్షోభం అక్కడి టెక్స్‌టైల్స్ పరిశ్రమను కుదేలు చేస్తోంది. ఈ క్రమంలో అనేక భారతీయ కంపెనీలు దీని ద్వారా ఆర్డర్లను పొందుతూ లాభపడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ ప్రముఖ టెక్స్‌టైల్స్ అండ్ వస్త్రాల తయారీ కంపెనీ రేమండ్ సైతం అనేక గ్లోబల్ సంస్థల నుంచి "భారీ సంఖ్యలో విచారణలు" పొందినట్లు చైర్మన్ గౌతమ్ సింఘానియా తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద సూట్ తయారీ సంస్థగా అవతరించటానికి గార్మెంటింగ్ ఫెసిలిటీలో పెట్టుబడులు పెట్టిన రేమాండ్స్ ప్రస్తుత పరిస్థితులను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉందని సింఘానియా వెల్లడించారు.

ఫాబ్రిక్, గార్మెంటింగ్ వ్యాపారం రెండింటిలోనూ రేమండ్ వంటి కంపెనీలు ఉన్నందున, అన్ని దశలను అనుసంధానించే ఎండ్-టు-ఎండ్ సరఫరా సామర్థ్యాలతో భారతదేశం మెరుగైన స్థానంలో ఉందని సంఘానియా చెప్పారు. అంతర్జాతీయ బ్రాండ్‌లకు సకాలంలో డెలివరీలు అందించటం ద్వారా సమయం సైతం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి బంగ్లాదేశ్‌కు ఫాబ్రిక్ సరఫరా లేదు. అయితే ఇండియాలో ఫాబ్రిక్ బేస్ ఉన్నందున దానిని సద్వినియోగం చేసుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సింఘాని అన్నారు.
అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న సమస్య బంగ్లాదేశ్ కార్మికుల కంటే భారతీయ కార్మికులు కొంత ఖరీదు ఎక్కువ. అయితే ఇండియా రాజకీయంగా స్థిరమైన దేశం, ఎక్కువగా మధ్యతరగతి వినియోగం, తయారీ సామర్థ్యాలతో ఉంది. సింఘానియా 'చైనా+1' వ్యూహం సానుకూల ప్రభావాన్ని కూడా హైలైట్ చేశారు. ఇది భారతదేశాన్ని ప్రాధాన్య సోర్సింగ్ గమ్యస్థానంగా మారుస్తోందన్నారు. అలాగే చైనాతో పోల్చితే ఇండియాలో ఉత్పత్తి చేసిన దుస్తుల పని నాణ్యత అధికంగా ఉందని పేర్కొన్నారు. జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో రేమాండ్స్ కార్యకలాపాల నుంచి ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 26.7 శాతం పెరిగి రూ.57.04 కోట్లుగా నివేదించింది. ప్రస్తుతం సింఘానియా విదేశీ బ్రాండ్ల నుంచి ఆర్డర్ల కోసం ఎంక్వైరీలు వస్తున్నట్లు పేర్కొనటం వాస్తవానికి కంపెనీకి సానుకూలమైన అంశం. సోమవారం ట్రేడింగ్ సమయంలో ఈ వార్త కంపెనీ షేర్లలో ర్యాలీకి దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications