కరువు సీమకు కరువు తీరేలా పెట్టుబడులు.. రాయలసీమలో రూ.5,217 కోట్లతో 23 ఒప్పందాలు.. 7,613 ఉద్యోగాలు..
Rayalaseema: ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి సరికొత్త బాటలు పడుతున్నాయి. రాయలసీమను పారిశ్రామిక తయారీ కేంద్రంగా (Industrial Manufacturing Hub), అలాగే ప్రపంచ స్థాయి ఉద్యానవన హబ్‌గా (Global Horticulture Hub) తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజాగా అనంతపురంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లో జరిగిన సీఐఐ (CII) ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులో ఈ దిశగా చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి.
ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో ఏకంగా రూ.5,217.39 కోట్ల విలువైన 23 కీలక అవగాహన ఒప్పందాలను (MoUs) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ల ద్వారా రాయలసీమ ప్రాంతంలోని స్థానిక యువతకు 7,613 ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆటోమొబైల్ విడిభాగాలు, ఏరోస్పేస్, రక్షణ రంగం (Defence), ఉక్కు, ఆహార ప్రాసెసింగ్, హోటళ్ల రంగాల్లో ఈ భారీ పెట్టుబడులు రాబోతుండటం విశేషం.

వివిధ రంగాల్లో వస్తున్న ప్రధాన పెట్టుబడులు:
ఆటోమొబైల్ రంగం: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా (Kia) ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా హ్వాసిన్ ఆటోమోటివ్ సంస్థ రూ.850 కోట్లతో ఫోర్-వీలర్ విడిభాగాల యూనిట్‌ను, సియోయాన్ సంస్థ రూ.514 కోట్లతో ఆటోమొబైల్ ఇంటీరియర్ భాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అలాగే కర్నూలులో ఇవామెట్ ఇండియా రూ.250 కోట్లతో మరో ఆటో విడిభాగాల యూనిట్‌ను స్థాపించనుంది.
ఏరోస్పేస్ & రక్షణ రంగం: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.435.75 కోట్ల వ్యయంతో 600 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక డ్రోన్ సిటీ అభివృద్ధి జరుగుతోంది. అజిస్తా కాంపోజిట్స్ రూ.810 కోట్లతో ఏరోస్పేస్ కాంప్లెక్స్‌ను, వీరా టాక్టికల్ డైనమిక్స్ రక్షణ పరికరాల తయారీకి రూ.165 కోట్లు, స్టార్మింగ్ యూనివర్స్ డ్రోన్ల తయారీకి రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. టేకులోడు ఏరోస్పేస్ పార్కులో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్ కోసం రూ.2,000 కోట్ల భారీ వ్యయంతో ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ రానుంది.
ఉక్కు & ఆహార ప్రాసెసింగ్: అనంతపురంలో హరిఓమ్ పైప్స్ ఇండస్ట్రీస్ రూ.700 కోట్లతో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని, కర్నూలులో స్టెడ్‌ఫాస్ట్ స్టీల్స్ రూ.536 కోట్లతో స్టీల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. హార్టికల్చర్ రంగంలో నకోడా డెయిరీ చిత్తూరులో రూ.340 కోట్లతో ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఇవి కాకుండా టెక్స్‌టైల్స్ మరియు హోటళ్ల రంగాల్లోనూ కొన్ని ఒప్పందాలు కుదిరాయి.
రాష్ట్ర ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం కుదుర్చుకున్న పారిశ్రామిక ఒప్పందాలలో 70 శాతానికి పైగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చాయని తెలిపారు. ఏపీఐఐసీ (APIIC) ఎండీ దినేష్ కుమార్ వెల్లడిస్తూ.. గత రెండేళ్లలో రాష్ట్రానికి ఏకంగా రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా, వాటిలో రూ.16.16 లక్షల కోట్లు భూ కేటాయింపుల రూపంలోకి మారాయని స్పష్టం చేశారు.
కరువు, తాగు-సాగు నీటి సమస్యలు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలతో దశాబ్దాలుగా రాయలసీమ వెనుకబడి ఉందనే భావన ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించి పెట్టుబడులను ఆకర్షించడం గొప్ప పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కియా లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ ఉండగా, వాటి చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు (Ancillary Units) వస్తుండటం స్థానిక యువతకు ఉపాధి పరంగా ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పెట్టుబడుల ప్రవాహం ఇలాగే కొనసాగితే రాయలసీమలోని ప్రాంతీయ అసమానతలు తొలగిపోయి, రాష్ట్రంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల సరసన ఇది కూడా నిలవనుంది.


Click it and Unblock the Notifications
