Tata: టాటా గ్రూపు అధినేత రతన్ టాటా దేశానికి అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ కంపెనీలు నెలకొల్పి, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆ సంస్థలు ఇండియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ, విదేశాల్లో పలు అవార్డులు, రివార్డులు ఆయనకు దాసోహం అయ్యాయి. తాజాగా మరో అవార్డు ఆయన ఖాతాలో చేరింది.
'మహారాష్ట్ర భూషణ్'తరహాలో 'ఉద్యోగ రత్న' పేరిట మరో ప్రఖ్యాత అవార్డును ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు తొలి అవార్డును ఇస్తున్నట్లు వెల్లడించింది. పరిశ్రమల విభాగంలో దీనిని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అయితే రతన్ టాటాకు తొలి అవార్డు ఇవ్వాలన్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సాహిత్యం, కళలు, సైన్స్ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మహారాష్ట్ర భూషణ్ అవార్డును ప్రభుత్వం అందజేస్తోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది నుంచి ఉద్యోగరత్నను సైతం ఇవ్వనున్నారు. ఏదేమైనా మొదటి అవార్డును సరైన లెజెండ్ కు ఇవ్వడం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో టాటా గ్రూపు ఒకటి. అంచెలంచెలుగా దానిని అభివృద్ధి చేస్తూ, విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో రతన్ టాటా ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికీ గ్రూపు గౌరవ ఛైర్మన్ గా ఆయన కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఎంతో సింపుల్ జీవన విధానంతో పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications