కరోనా మహమ్మారిపై పోరాటానికి టాటా ట్రస్ట్ రూ.1,500 కోట్లు అందిస్తోంది. ఈ నిధులను కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి, రెస్పిరేటరి సిస్టమ్స్, టెస్టింగ్ కిట్స్ తయారీకి, వైరస్ సోకిన వారికి మాడ్యులర్ చికిత్సా సౌకర్యాల ఏర్పాటు, ఆరోగ్యకార్యకర్తల శిక్షణ, జనరల్ పబ్లిక్.. ఇలా వివిధ అవసరాల కోసం వీటిని ఉపయోగిస్తామని టాటా ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో టాటా ట్రస్ట్ రూ.500కోట్లు, టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ రూ.1,000 కోట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. దీనికి తక్షణ చర్యలు అవసరమని చెప్పారు. దేశంలోని అవసరాలకు అనుగుణంగా టాటా ట్రస్ట్, టాటా కంపెనీలు ఎదిగాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని అదుపు చేయడానికి మించిన ప్రాధాన్యత లేదన్నారు. ఈ కష్టకాలంలో కరోనాతో పోరాడేందుకు అత్యవసర వనరులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నానన్నారు.

టాటా ట్రస్ట్స్, టాటా సన్స్, టాటా గ్రూప్ కంపెనీలు కరోనాపో పోరుకు స్థానిక, గ్లోబల్ సంస్థలతో, అలాగే, ప్రభుత్వాలతో కలిసి పని చేస్తాయి. కాగా, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 28,239 మంది చనిపోయారు. 6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో లక్షకు పైగా కేసులు నమోదు కాగా 1,704 మంది మృత్యువాత పడ్డారు. ఇటలీలో 86వేల కేసులు నమోదు కాగా, 9,134 మృతి చెందారు. చైనాలో 81వేల కేసులు నమోదు కాగా 3,295 మంది మృతి చెందారు. స్పెయిన్‌లో 72వేల కేసులు నమోదు కాగా 5,690 మంది చనిపోయారు. జర్మనీలో 399 మంది, ఇరాన్‌లో 2,517 మంది, ఫ్రాన్స్‌లో 1,995 మంది, యూకేలో 759 మంది చనిపోయారు.


Click it and Unblock the Notifications