Ratan Tata: కేవలం గొప్ప బిజినెస్ మ్యాన్‌గా మాత్రమే కాకుండా విలువలు కలిగిన మనిషిగా రతన్ టాటాకు మంచి పేరుంది. ఆయన చేసే ప్రతి పనిలోనూ నిబద్ధత కనిపిస్తూ ఉంటుంది. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటికోసం ఏకంగా ఓ ఆసుపత్రి నిర్మించి, సేవలందిస్తున్నారు. తాజాగా ఆయన సహాయం కోరుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అదికాస్తా వైరల్‌గా మారింది.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుక్క కోసం రక్తదాత కావాలని కోరుతూ రతన్ టాటా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు. చిన్న జంతు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 నెలల కుక్క చిత్రాన్ని పోస్ట్ చేశారు. కుక్కకు అత్యవసరంగా రక్తం అవసరమని ఆసుపత్రి సిబ్బంది చెప్పారన్నారు. అది తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతుండగా.. రక్తం దొరకకపోతే ప్రాణానికి సైతం ముప్పు తప్పదని వారు అభిప్రాయపడినట్లు వెల్లడించారు.

'నేను మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. మా జంతు ఆసుపత్రిలో ఉన్న ఈ 7 నెలల కుక్కకు అత్యవసరంగా రక్తమార్పిడి అవసరం. టిక్ ఫీవర్ మరియు ప్రాణాంతక రక్తహీనత చికిత్స కోసం ఆ శునకం ఆసుపత్రిలో అడ్మిట్ చేయబడింది. ఇందుకుగాను మాకు తక్షణమే ముంబైలో కుక్క రక్తదాత అవసరం. సంభావ్య దాత కుక్కల అర్హత ప్రమాణాల ఇక్కడ ఉన్నాయి' అని పోస్టులో పేర్కొన్నారు. 'ముంబయి, నాకు మీ సహాయం కావాలి' అంటూ కుక్క ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేశారు.
ఈ పోస్ట్‌పై పలువురు జంతు ప్రేమికులు, ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. రతన్ టాటా దయార్ద్ర హృదయానికి సెల్యూట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న కుక్కకు సహాయం చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. జంతువుల కోసం ఆయన అలా సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని పలుమార్లు పిలుపునిచ్చారు. టాటా గ్రూప్ హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల వీధికుక్కల కోసం ప్రత్యేక కెన్నెల్ కూడా ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications