దర్శకుడు శేఖర్ కమ్ముల 'లీడర్' సినిమాలో హీరోగా, జక్కన్న 'బాహుబలి'లో విలన్ గా ప్రేక్షకులను మెప్పించిన నటుడు దగ్గుబాటి రానా. యాక్టర్ కంటే ముందు ఆయన ఓ బిజినెస్ మ్యాన్ అని చాలా తక్కువ మందికే తెలుసు. ఆ వ్యాపారం విషయంలో తన అనుభవాలను ఆయన తాజాగా బయటపెట్టారు.
దగ్గుబాటి రానా 2005లో తన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియాను ప్రారంభించారు. కానీ ఈ రంగంలోకి ప్రవేశించడానికి అప్పట్లో తొందరపడటం వల్ల దాన్ని మూసివేయాల్సి వచ్చిందట. దీని కారణంగా ఆయన తండ్రి తనతో మాట్లాడటం మానేశారని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

'నేను 18 ఏళ్ల క్రితం స్పిరిట్ మీడియాను నిర్మించి, విజువల్ ఎఫెక్ట్స్ చేయడం ప్రారంభించాను. ఐదేళ్ల పాటు పనిచేశాను. ఒక ఫిల్మ్ మేకర్ నా స్టూడియోలోకి వెళ్లి 'బాహుబలి' వంటి సినిమా తీయాలని ఆశించాను. కానీ అప్పుడు కుదరలేదు. అనంతరం 10 ఏళ్ల తర్వాత అది సాధ్యమైంది' అని 'అన్‌బాక్సింగ్ అన్‌లెర్నింగ్' అనే పోడ్ కాస్ట్ తొలి ఎపిసోడ్‌లో రానా తెలిపారు.
ఆ సంస్థను విక్రయించడానికి గల కారణాలను సైతం ఆయన వివరించారు. 'విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో డిమాండ్ కు ముందే, చాలా తొందరగా అడుగుపెట్టాను. అయితే మూడు, నాలుగేళ్ల తర్వాత దాన్ని నిర్వహించడం సవాలుగా మారింది. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇది సరదా వ్యాపారం కాదని అర్థమైంది' అని చెప్పుకొచ్చారు.
ఈ అనుభవంతో తన కంపెనీనీ ప్రైమ్ ఫోకస్ కి అమ్మేసినట్లు రానా తెలిపారు. ఇప్పుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీగా అవతరించిందన్నారు. అప్పట్లో 2005లో 'ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్' పేరిట ఒక చిత్రాన్ని సైతం నిర్మించినట్లు రానా వెల్లడించారు. అది కాస్తా పండుగ రోజు విడుదలై, రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నట్లు చెప్పారు. అయితే థియేటర్లలో మాత్రం విడుదల కాలేదన్నారు.


Click it and Unblock the Notifications