Ram Chandra Agarwal: పడిలేచిన కెరటం.. రామ్ చంద్ర అగర్వాల్.. వైకల్యాన్ని జయించి విజయం సాధించాడు..
కొంత మంది తమకు డబ్బు లేదు అందుకే ఏం చేయలేకపోయా అంటారు. కొంత మంది తమకు చదువు లేదు ఏం చేయలేకపోయా అని సాకులు చెబుతున్నారు. కానీ.. వైకల్యం ఉన్నా కొందరు జీవితాన్ని సాగిస్తున్నారు. ఎన్నో విజయాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలానే ఓ వ్యక్తి తనకు పోలియో ఉన్నా వెనకడుగు వేయకుండా కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఒక చిన్న ఫోటో షాపు నుంచి దేశంలో రిటైల్ స్టోర్ విప్లవానికి పునాది వేశాడు.. రామ్ చంద్ర అగర్వాల్. విశాల్ మెగా మార్ట్ ను స్థాపించి సక్సెస్ అయ్యాడు.
పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలోన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన రామ్ చంద్ర అగర్వాల్ నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డారు. అతని శరీరంలోని ఒక కాలు పడిపోయింది. దీంతో కర్ర సాయంతోనే నడిచేవాడు. అయితే తనకు కాలు లేదని రామచంద్ర ఎప్పుడు అనుకోలేదు... ఏదో ఒకటి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన వద్ద డబ్బులు లేకున్నా.. అప్పుగా తీసుకున్న డబ్బుతో కోల్‌కతాలో ఒక చిన్న ఫోటో స్టూడియో స్టార్ట్ చేశాడు. ఒక సంవత్సరం పాటు ఫొటో స్టూడియో నడిపాడు. అయితే ఇంకా ఏదైనా చేయాలని అనుకున్నాడు. కూల్ డ్రింక్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. పెద్ద లాభం రాలేదు. ఆ తర్వాత ఫాబ్రిక్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. కోల్ కత్తాలో వస్త్ర దుకాణం ప్రారంభించాడు.

దాదాపు 15 ఏళ్ల పాటు ఈ రంగంలో కొనసాగాడు. వ్యాపారం బాగానే ఉన్నప్పటికీ ఇంకా ఏదో చేయాలని ఢిల్లీకి మకాం మార్చాడు. పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా విశాల్ మెగా మార్ట్ ను ప్రారంభించాడు. రూ.99 లకే నిత్యావసర వస్తువులు, వస్త్రాలు అమ్మడం మొదలు పెట్టాడు. దీంతో తక్కువ సమయంలోనే ప్రజల్లో విశాల్ మెగా మార్ట్ పేరు మారుమోగింది. దీంతో మరో ప్రాంతంలో మరో స్టోర్ ఓపెన్ చేశాడు. ఇలా.. 414 నగరాల్లో 645 స్టోర్లు ఏర్పాటు చేశాడు. 2,50,000 చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విశాల్ మెగా మార్ట్ కొనసాగుతున్నాయి.
ఎంత త్వరగా విశాల్ మెగా మార్ట్ అభివృద్ధి చెందిందో అంత త్వరగా నష్టాల్లోకి వెళ్లింది. భారీగా స్టోర్లను విస్తరించడం వల్ల కంపనీ నష్టాల్లోకి వెళ్లింది. దీనికి 2008 ఆర్థిక మాంద్యం వెంటాడింది. కంపెనీ అప్పులు రూ.750 కోట్లకు చేరుకున్నాయి. అప్పు తీర్చే మార్గం లేక.. విశాల్ మెగా మార్ట్ ను అమ్మాలని అగర్వాల్ నిర్ణయించారు. రూ.1100 కోట్ల విలువైన కంపెనీనీ కేవలం రూ.70 కోట్లకే శ్రీరామ్ అండ్ టీపీజీ క్యాపిటల్ కు విక్రయించాడు. అయితే 2018 సంవత్సరంలో కేదార క్యాపిటల్ అండ్ పార్టనర్ గ్రూప్ ఇదే విశాల్ మెగా మార్ట్ ను రూ.3 వేల కోట్లకు కొనుగోలు చేసింది.
రామచంద్ర అగర్వాల్ ఓటమితో దిగులు చెందలేదు. రూ.10 కోట్లు అప్పు తీసుకుని వీ2 మార్ట్ అనే రిటైల్ సూపర్ మర్కెట్ ను స్థాపించాడు. జీరో నుంచి మొదలు పెట్టి మళ్లీ హీరో అయ్యాడు. ఈ కంపెనీ కూడా స్టాక్ మార్కెట్‌లో విజయవంతంగా లిస్ట్ అయింది. 2025 మే నాటికి ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 6,530 కోట్లకు చేరింది.


Click it and Unblock the Notifications