Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ గా రాకేష్ జున్‌జున్‌వాలాను పరిగణిస్తారు. ఆయన పోర్ట్‌ఫోలియోను చాలా మంది ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉంటారు. ఏవైనా కొత్త కొనుగోళ్లు చేశారా..? ఎవైనా అమ్మేశారా..? ఆయన పెట్టుబడుల పనితీరు ఎలా ఉందనే అంశాని గమనించి తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన పెట్టుబడి పెట్టిన ఒక స్టాక్ మాత్రం రాకెట్ లాగా పెరుగుతోంది.

రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియో..
రాకేష్ జున్‌జున్‌వాలా సపోర్టెడ్ ఆన్‌లైన్ గేమింగ్ స్టాక్ నజారా టెక్నాలజీస్ షేర్లు ఈరోజు అద్భుతమైన ర్యాలీని కలిగి ఉన్నాయి. ఈ రోజు స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 20 శాతం పెరిగి రూ.636.10 వద్ద అప్పర్ సర్క్యూట్ లో ముగిశాయి. కంపెనీ స్టాక్ జూలై 2022లో 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.475.05కి చేరుకుంది. ప్రస్తుతం రేటు ప్రకారం స్టాక్ తన కనిష్ఠ ధర కంటే దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది.

షేర్ ధర పెరుగుదలకు కారణం..
కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్లో ఇంత భారీ స్థాయిలో పెరగడానికి త్రైమాసిక ఫలితాలే కారణమని తెలుస్తోంది. అయితే కంపెనీ తన క్యూ1 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. దీని తరువాత ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభం నుంచే నజారా టెక్నాలజీస్ షేర్ రాకెట్ లాగా దూసుకుపోయింది. శుక్రవారం ముగిసే సమయానికి స్టాక్ ధర రూ.530.10 వద్ద ముగిసింది. అంటే ఒక్కరోజులోనే షేరుకు రూ.100కు పైగా పెరిగింది.

మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే..
స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏప్రిల్ నుంచి జూన్ 2022 త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన వృద్ధిలో ఎక్కువ భాగం కంపెనీ విలీనాలు, కొనుగోళ్ల కారణంగానే ఉంది. బిగ్ బుల్ మద్దతు కలిగిన కంపెనీ ఇప్పటికీ కీలక మెట్రిక్స్ విషయంలో వెనకపడే ఉందని నిపుణులు అంటున్నారు. జూన్ త్రైమాసికంలో నజారా టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 22 శాతం పెరిగింది. నజారా టెక్నాలజీస్ Q1FY22లో రూ.16.50 కోట్ల లాభాన్ని నివేదించింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం దాదాపు 70 శాతం మేర పెరిగింది.

స్టాక్ టార్గెట్ ధర ఎంతంటే..?
ఈ ఆన్‌లైన్ గేమింగ్ స్టాక్ TIS కనిష్ట స్థాయిలను అధిగమించింది. స్టాక్ రూ.525 నుంచి రూ.550 స్థాయిల వరకు బలమైన మద్దతును కలిగి ఉందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు. స్టాక్ బ్రోకరేజ్ అంచనాల ప్రకారం రూ.650-రూ.670 స్థాయిలను చేరుకునే అవకాశం ఉంది.
ఈ కంపెనీలో 2022 ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికానికిగాను రాకేష్ జున్‌జున్‌వాలా 65,88,620 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. అంటే కంపెనీ మెుత్తం షేర్లలో జున్‌జున్‌వాలాకు 10.03 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications