PM Modiపై దుమ్మెత్తిపోస్తున్న Rahul Gandhi.. పీఎఫ్ సొమ్ము విషయంలో ఫైర్..!
Rahul Gandhi: ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లో ప్రభుత్వం పెట్టుబడులుగా పెట్టడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందు నుంచి తప్పుపడుతూనే ఉన్నారు. పతనమౌతున్న అదానీ గ్రూప్ కంపెనీల్లో EPFO పెట్టుబడులను కొనసాగిస్తుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీపై రాహుల్ విరుచుకుపడ్డారు. పార్లమెంటులో తాము మోదీ-అదానీకి ఉన్న సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటామని.. తమ నోరు నొక్కే ప్రయత్నం కుదరదని గతంలో రాహుల్ వెల్లడించారు.
ఈ క్రమంలో రెండు రోజుల కిందట మోదీ ఇంటిపేరుకు సంబంధించిన కేసులో లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడటం సంచలనంగా మారింది. ఉద్యోగుల పదవీ విరమణ డబ్బును అదానీ కంపెనీల్లో ఎందుకు పెట్టుబడిగా పెడుతున్నారని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఎల్ఐసీ, ఎస్బీఐ సొమ్మును అదానీ కంపెనీల్లో పెట్టిన తర్వాత.. ఈపీఎఫ్ఓ మూలధనాన్ని సైతం అదానీకి ఇస్తున్నారని అన్నారు. మెుదానీ సంబంధాలు బయటపడిన తర్వాత కూడా ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు.

"మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, నో ఇన్వెస్టిగేషన్, నో ఆన్సర్! ఎందుకు అంత భయం" అంటూ హిందీలో ట్వీట్ చేశారు. అమెకాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ అదానీ కంపెనీల్లో మోసపూరిత లావాదేవీలు జరిగాయని, అకౌంటింగ్ అవకతవకలు ఉన్నాయని, విదేశాల నుంచి సొమ్ము బూటకపు కంపెనీల ద్వారా మళ్లించబడిందని సంచలన ఆరోపణలతో రిపోర్టును విడుదల చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీలు కుప్పకూలి ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కోల్పోయారు. దీంతో ఇది దేశంలో అతిపెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. కేంద్రం మంత్రులు దీనిపై ప్రజలకు జవాబు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
హిండెన్‌బర్గ్ వివాదం తర్వాత కుప్పకూలిన రెండు అదానీ కంపెనీల్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల పదవీ విరమణ సొమ్మును అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుంది. సెప్టెంబరు వరకు పెట్టుబడులను అలాగే కొనసాగుతాయని సంస్థ సమావేశంలో వెల్లడించింది. ఎల్ఐసీ రూ.4,000 కోట్లకు పైగా డబ్బును అదానీ కంపెనీల్లో పెట్టగా.. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ సంస్థలకు రూ.21,000 కోట్లను రుణాలుగా ఇచ్చింది.
అదానీ అంశంపై తాను ప్రశ్నలు లేవనెత్తడం వల్లనే ఇటీవల లోక్‌సభ నుంచి తనపై అనర్హత వేటు పడిందని రాహుల్ గాంధీ వెల్లడించారు. అయితే తాను పార్లమెంటుకు జీవితకాలం అనర్హత వేటు వేసినా కూడా ప్రజల కోసం ప్రశ్నించటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తాజాగా ఆయనకు ప్రభుత్వం కల్పించిన వసతి భవనాన్ని సైతం ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. సూరత్ కోర్టు పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం లోక్‌సభకు అనర్హుడిగా మారారు.


Click it and Unblock the Notifications