Tomato Prices: మోదీని ఏకేసిన రాహుల్ గాంధీ.. గ్యాస్, కూరల ధరలపై ప్రశ్నల వర్షం..
తాజాగా దేశంలో టమాటా ధరలు సెంచరీలను దాటేసి కిలో రూ.140కి చేరుకోవటంపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. విపరీతంగా పెరిగిపోతున్న రేట్లు సామాన్యులకు మోయలేని భారంగా మారాయని తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. మోదీ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజలను మర్చిపోయిందంటూ విరుచుకుపడ్డారు. ప్రధాని పెట్టుబడిదారుల సంపదను పెంచడంలో బిజీగా ఉన్నారని అన్నారు.
ప్రస్తుతం దేశంలో టమాటా కిలో రూ.140, క్యాలీఫ్లవర్ రూ.80, కందిపప్పు రూ.148కి చేరుకున్నాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,100 పైనే ఉందని అన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న విషయాన్ని మర్చిపోయిన బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారుల సంపదను పెంచే పనిలో బిజీగా మారిందని అన్నారు. పేద, మధ్యతరగతని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని ట్విట్ చేశారు.

దేశంలోని యువత నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారని.. ఒకవేళ ఏదైనా ఉపాధి పొందిన అధిక ద్రవ్యోల్బణం, రేట్ల కారణంగా డబ్బు పొదుపు చేయటం లేదని రాహుల్ గాంధీ అన్నారు. పేదలు కనీసం తినటానికి కష్టపడుతుంటే.. మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసేందుకు ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గ్యాస్ ధరలను తగ్గించాయని, ఆర్థిక సహాయం కోసం పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేశాయని రాహుల్ వెల్లడించారు. బీజేపీ తన ద్వేషపూరిత రాజకీయాల కోసం సమాజాన్ని పోలరైజ్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.


Click it and Unblock the Notifications