Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎప్పటికప్పుడు తన అంచనాలు, అభిప్రాయాలను పంచుకుంటుంటారు.
భారతదేశ వాస్తవ వృద్ధి రేటు 8-8.5 శాతం ఉండకపోవచ్చని, దాదాపు 6 నుంచి 6.5 శాతం ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తాజాగా పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్‌కు 9-10 శాతం వృద్ధి రేటు అవసరమని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ కెల్లాగ్ బిజినెస్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కూడా ఉన్నారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయరంగంలో అభివృద్ధి అనేది ఒక మోసం అని రఘురామ్ రాజన్ అన్నారు. ప్రజలు వ్యవసాయంలో ఉద్యోగాల కోసం ఎందుకు చూస్తున్నారు? ఇది తక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటుంది. వారు వేరే చోట ఉద్యోగాలు వెతకాలని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో భారతదేశంలో లేబర్ మార్కెట్ సరిగ్గా పని చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. దీనివల్లే యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇండియాలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు.
భారతదేశంలో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల అమ్మకాలను ఉదాహరణగా పేర్కొంటూ.. కరోనా తర్వాత వీటికి డిమాండ్ దేశంలో పెరగాల్సినంతగా పెరగలేదని అన్నారు. గత కొన్నేళ్లుగా మధ్యతరగతి వర్గాల వృద్ధి మందగిస్తోందని, అలాగే కార్ల కొనుగోళ్లు సైతం అధిక విలువ కలిగినవి తక్కువగా ఉన్నాయన్నారు. మధ్యతరగతి ప్రజలు ప్రీ-కరోనా స్థాయికి చేరుకోలేదని ఉదహరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు రెండు ముఖాలు ఉన్నాయని రాజన్ అన్నారు. ఒకటి ముఖం చైనా ప్లస్ వన్ విధానం.. ఇది భారతదేశంలో ఆపిల్ బిల్డింగ్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతాము. ఇంకో ముఖం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉద్యోగాల కోసం వెతుకులాటలో కొనసాగటమని అన్నారు.


Click it and Unblock the Notifications