Economy News: ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆర్థిక పాఠాలు.. ఇలా చేస్తే భారత్ వృద్ధి లెక్క పక్కా..
Raghuram Rajan: భారత్ వృద్ధిపై అంతర్జాతీయ సంస్థలు సహా పలు దేశాలు పాజిటివ్ గా ఉన్నాయి. ప్రపంచం అంతా మాంద్యం భయాలతో వెనుకబడినా, ఇండియా మాత్రం వాటికి పూర్తి భిన్నంగా ముందుకు కదులుతోంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
దేశం వృద్ధి పథంలో కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయని రాజన్ గుర్తు చేశారు. దాన్ని ఎదుర్కొని నిలబడేందుకు అధిక విలువ కలిగిన దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ తరహా ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు అడుగులు వేయాలన్నారు. అప్పుడే ద్రవ్యోల్బణాన్ని సమర్థవంతంగా కట్టడి చేసే అవకాశం ఉంటుందన్నారు.

దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగిత రేటు పైనా కీలక సూచనలు చేశారు. ఒక పక్క యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే దేశం ఎలా వృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్య ఇవ్వడం ద్వారా తలసరి ఆదాయం కూడా మెరుగుపడుతుందన్నారు. సంపద సృష్టికి పెద్దపీట వేస్తూనే ఉద్యోగ అవకాశాలు సృష్టించడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.
వీటికి తోడు యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో రాజీలేని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు రాజన్ తెలిపారు. అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే నైపుణ్యం యువత సొంతమవుతుందని వెల్లడించారు. కేవలం పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఉన్నత విద్యను బలోపేతం చేస్తూ, అందరికీ అందుబాటులో ఉండేవిధంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.


Click it and Unblock the Notifications