DMart Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిచయం అవసరం లేని పెట్టుబడిదారుడు రాధాకిషన్ దమానీ. తాజాగా ఆయనకు చెందిన రిటైల్ స్టోర్ల వ్యాపారం అవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డీమార్ట్ స్టాక్ భారీ ర్యాలీని నమోదు చేసింది. సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకుంది.
రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని అవెన్యూ సూపర్‌మార్ట్‌ల షేర్లు 5.6% పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.4,710.15కి చేరుకున్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.3 లక్షల కోట్లు దాటింది. షేర్లు ఇలా పెరగడం వెనుక కారణం డీమార్ట్ వ్యాపారం నాలుగో త్రైమాసికంలో మంచి వృద్ధిని సాధించటమే. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాండ్‌లోన్ రాబడి రూ.12,393.46 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.10,337.12 కోట్లతో పోలిస్తే దాదాపు 20% అధికం కావటం గమనార్హం.

ఈ త్రైమాసికంలో ప్రతి స్టోర్ ఆదాయం 7 శాతం మేర వృద్ధి చెందింది. దేశవ్యాప్తంగా కంపెనీకి 365 స్టోర్లు ప్రస్తుతం ఉన్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ CLSA రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని అవెన్యూ సూపర్‌మార్ట్ షేర్లపై 'BUY' రేటింగ్ ఇచ్చింది. బ్రోకరేజ్ ఒక్కో షేరుకు రూ.5,107 టార్గెట్ ధరతో కవరేజీని ప్రారంభించింది. అలాగే మోతీలాల్ ఓస్వాల్ షేర్లకు రూ.4,700 టార్గెట్ ధరగా ఉంచింది. డీమార్ట్ స్టాక్ ధర గత నెలలో 20% పెరగగా.. ఏడాదిలో 30 శాతం మేర పెరిగింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రాధాకిషన్ దమానీ సంపద కూడా పెరిగింది. దమానీ నికర విలువ ప్రస్తుతం 21.2 బిలియన్ డాలర్లుగా ఉంది. గత 24 గంటల్లో ఆయన సంపద 387 మిలియన్ డాలర్లు పెరగటం గమనార్హం. డిసెంబర్ 31 నాటికి దమానీ 14,98,48,238 డీమార్ట్ షేర్లు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది కంపెనీలో దాదాపు 23 శాతం వాటాతో సమానం. ఇదే సమయంలో దమానీ భార్య కాంతదేవి 1 శాతం వాటాతో 65,00,000 షేర్లు హోల్డ్ చేస్తున్నారు. సోదరుడు గోపికిషన్ శివకిషన్ దమానీ 3,64,69,012 షేర్లు లేదా 5.60 శాతం వాటాను కలిగి ఉన్నారు. మెుత్తానికి డీమార్ట్ ప్రమోటర్లైన దమానీ ఫ్యామిలీ కంపెనీలో 74.65 శాతం వాటాను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications