DMart Q4 Results: దేశంలో రిటైల్ స్టోర్ల వ్యాపారంలో రాధాకిషన్ దమానీకి చెందిన డిమార్ట్ స్టోర్లు ప్రజలకు చేరువయ్యాయి. తక్కువ ధరలతో పాటు అనేక ఆఫర్లను అందిస్తూ ఈ స్టోర్లు సామాన్యుల ఆదరణను పొందాయి.
డిమార్ట్ పేరుతో రాధాకిషన్ దమానీ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్స్ దేశ వ్యాప్తంగా ఈ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.10,337 కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు 21 శాతం అధికం. అదే విధంగా కంపెనీ నికర లాభం గతంలో కంటే 8 శాతం పెరిగి రూ.505.21 కోట్లకు చేరుకుంది.

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.11,304.58 కోట్ల ఆదాయంతో పోల్చితే మార్చిలో అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. అలాగే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.641.07 కోట్ల నుంచి తగ్గింది. డిమార్ట్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.7,999.03 కోట్ల నుంచి రూ.9,709.20 కోట్లకు పెరిగింది. కంపెనీ మార్జిన్లు ఏడాది ప్రాతిపదికన 8.6 శాతంతో పోలిస్తే 7.6 శాతానికి తగ్గాయి. మే 13న జరిగిన సమావేశంలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ బోర్డు ఫలితాలను ఆమోదించింది.
ముంబై కేంద్రంగా ఏర్పాటైన అవెన్యూ సూపర్‌మార్ట్స్ యాజమాన్యంలోని.. DMart సూపర్ మార్కెట్‌లు ఆహారం, టాయిలెట్‌లు, బ్యూటీ ప్రొడక్ట్‌ల నుంచి కిచెన్‌వేర్, బెడ్ అండ్ బాత్ లినెన్, ఉపకరణాల వరకు అనేక రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. కంపెనీని రాధాకిషన్ దమానీ ఆయన కుటుంబం ప్రారంభించింది. మొదటి స్టోర్ 2002లో పొవాయ్‌లో ప్రారంభించబడింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, NCR, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్‌ల్లో ఏకంగా 324 ప్రాంతాల్లో స్టోర్లను డిమార్ట్ కలిగి ఉంది.


Click it and Unblock the Notifications