అవెన్యూ సూపర్ మార్ట్స్ (డి-మార్ట్) ద్వారా దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న బిలియనీర్ రాధాకిషన్ దమానీ ఇండియా సిమెంట్స్‌లో నియంత్రిత వాటాను కొనుగోలు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇండియా సిమెంట్స్ మేజర్ షేర్ హోల్డర్ ఎన్ శ్రీనివాసన్‌తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. శ్రీనివాసన్‌కు ఇందులో 29 శాతం వాటా ఉంది. ఆయన ఇన్వెస్టర్ల కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. అయితే దమానీ, శ్రీనివాసన్ ఎలా ముందుకు వెళ్తారో ఇంకా పూర్తిగా తెలియరాలేదని అంటున్నారు.

నాలుగు రెట్లు పెరిగింది
ఈ అంశంపై మాట్లాడేందుకు అవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రతినిధి నిరాకరించారట. అదే సమయంలో ఇండియా సిమెంట్స్ ప్రతినిధి సమాచారం తెలియకుండా స్పందించడం సరికాదని వ్యాఖ్యానించారట. ఈ రిటైల్ టైకూన్, అతని కుటుంబం గత కొన్ని నెలలుగా సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటాలను దక్కించుకుంటున్నారు. ఈ మార్చి 31 నాటికి వారి వాటా నాలుగు రెట్లు పెరిగి దాదాపు 20 శాతానికి చేరుకుందని తెలుస్తోంది.

దాదాపు 20 శాతం వాటా
మార్చి 31, 2020 తేదీ నాటికి కంపెనీలో దమానీ 10.29 శాతం వాటాను (3,18,86,777 షేర్లు) కలిగి ఉన్నారు. అతని సోదరుడు గోపికిషన్ శివ్‌కిషన్ దమానీ 8.26 శాతం వాటా (2,56,01,589) కలిగి ఉన్నారు. 2019 డిసెంబర్ నాటికి రాధాకిషన్ ధమానీ వాటా 4.73 శాతమే ఉంది. కానీ ఇప్పుడు 10.29 శాతానికి పెరిగింది. ఇండియా సిమెంట్స్‌ను దమానీ టేకోవర్ చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు ఓ సమయంలో 11 శాతం ఎగిశాయి. ఒక నెలలో ఇంట్రాడేలో ఇది అతిపెద్ద లాభం.

ఇరువురికి లాభం
ఇండియా సిమెంట్స్‌లో నియంత్రిత వాటాకు చేరుకోవడం ద్వారా దమానీకి వైవిధ్య రంగాల్లోకి వెళ్లడానికి ఉపయోగపడవచ్చు. అదే సమయంలో ప్రత్యర్థుల నుండి గట్టిపోటీని ఎదుర్కొంటున్న ఇండియా సిమెంట్స్‌కు కూడా ఉపకరిస్తుంది. రాదాకిషన్ ధమానీ ఆస్తులు ఈ ఏడాది 2.8 బిలియన్ డాలర్లు పెరిగి 12.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అతను ఇండియా నాలుగో కుబేరుడిగా నిలిచారు. ఎన్ శ్రీనివాసన్ 2019 నాటికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా 10 ఫ్యాక్టరీలు కలిగి ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో డిటర్జెంట్ తయారీదారు నిర్మా లిమిటెడ్ రూ.5,500 కోట్లతో ఇమామీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ బిజినెస్ కోసం అంగీకారం తెలిపింది.

మార్చి ఫలితాలు రావాలి
వివిధ కారణాలతో స్టాండాలోన్ బేసిస్ ప్రకారం ఇండియా సిమెంట్స్ నెట్ లాస్ 2019 డిసెంబర్ క్వార్టర్‌లో 5.37 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.3.13 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. నెట్ సేల్స్ 1,316.30 కోట్ల నుండి రూ.1,191.12 కోట్లకు పడిపోయాయి. మార్చి క్వార్టర్ ఫలితాలను ఇండియా సిమెంట్స్ ప్రకటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications