ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని పెట్టుబడులకు అమరావతిలో ఇదే సరైన సమయమని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఏపీలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని జీసీ ఇన్వెస్టర్లకు సూచించారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో ఏపీ రాజధాని అమరావతిలో మరో ఆరునెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు అవుతుందని ఏపీ విద్యాశాఖా మంత్రి ధీమా వ్యక్తం చేశారు. క్వాంటమ్ వ్యాలీ రాకతో భారతదేశం సాంకేతిక విప్లవంలో ఏపీ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు.

ఇప్పుడు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని..పెట్టుబడిదారులకు ఇదే సరైన సమయమని అందరూ ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. అమరావతితో పాటుగా విశాఖ మహానగరం ఐటీ హబ్‌గా తయారవుతోందని అన్నారు. వేలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని ఇన్వెస్టర్లకు నారా లోకేష్ వివరించారు. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా ఏపీలో రాయితీలు అందజేస్తున్నామని.. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు.
ఇక గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటులో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఏఎన్ఎస్ఆర్ (ఏఎన్ఎస్ఆర్) సంస్థ విశాఖపట్నంలో భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. మధురవాడ ఐటీ క్లస్టర్‌లో అత్యాధునిక జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా రానున్న ఐదేళ్లలో 10,000 మందికి పైగా నాణ్యమైన ఉద్యోగాలు లభించనున్నాయి.
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మంగళవారం ఈ ఒప్పంద పత్రాలపై ఇరు పార్టీల మధ్య సంతకాలు జరిగాయి.ఒప్పందం అనంతరం ఏఎన్ఎస్ఆర్ సంస్థ సీఈఓ లలిత్ అహూజా మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి ప్రతిభ, బలమైన మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం వంటివి విశాఖలో ఉన్నాయి. మా ఇన్నోవేషన్ క్యాంపస్ ద్వారా విశాఖను ప్రపంచ పటంలో నిలుపుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులను ప్రపంచ స్థాయి కంపెనీలతో అనుసంధానించడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నది మా లక్ష్యం. ఇందులో కేవలం ఐటీ, జీసీసీ రంగాల్లోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఈ ఉద్యోగాల ఉద్యమాన్ని విశాఖపట్నం నుంచే ప్రారంభించామని అన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలకు ఎకరా 99 పైసలకే భూములు కేటాయించాం.ఈ కేటాయింపుతో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యంలో ఇప్పటికే 12 శాతం నెరవేరింది. త్వరలోనే దేశంలోని టాప్-100 ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించాలన్నదే మా సంకల్పమని తెలిపారు.
అమెరికా వెలుపల గూగుల్ సంస్థ తన అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తోందని, దేశంలోనే అతిపెద్ద డేటా సిటీని కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని గుర్తుచేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో విశాఖకు ప్రపంచ స్థాయి కనెక్టివిటీ పెరుగుతుందని, ఈ నగరాన్ని ప్రపంచ జీసీసీ నూతన రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని నారా లోకేష్ తెలిపారు.


Click it and Unblock the Notifications