SEBI News: దేశంలో ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును నేరుగా స్టాక్ మార్కెట్లలో పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్ మార్గం ద్వారా సేఫ్ రిటర్న్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ఈ సమయంలో ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీపై సెబీ సోదాలు చాలా మంది ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కంపెనీ ఫంట్ రన్నింగ్ కి పాల్పడిందనే అనుమానాలతో మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ కంపెనీకి చెందిన హైదరాబాద్, ముంబై కార్యాలయాల్లో సోదాలు నిర్వహించటం పెద్ద సంచలనంగా మారింది. దీనిపై ఫండ్ హౌస్ యాజమాన్యం తాజాగా స్పందించింది.

దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న మ్యూచువల్ ఫండ్ సంస్థగా క్వాంట్ ఫండ్ హౌస్ గుర్తింపు పొందింది. 2019లో కేవలం రూ.100 కోట్ల ఆస్తుల నిర్వహణ స్థాయి నుంచి ప్రస్తుతం కంపెనీ ఏకంగా రూ.90,000 కోట్ల విలువైన సంపదను నిర్వహిస్తోంది. మార్కెట్లోని ఇతర సంస్థల కంటే మంచి రాబడులను అందిస్తున్న క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీకి సీఈవోగా సందీప్ టాండన్ ఉన్నారు. తాజాగా సెబీ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్లలో ఫండ్ హౌస్ కి సంబంధించిన డీలర్లు, ఇతర వ్యక్తులను సైతం ప్రశ్నించింది.
సెబీ సెర్చ్ నిజమేనని ప్రకటిస్తూ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ తన పెట్టుబడిదారులకు మెయిల్ పంపింది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటెడ్ ఎంటిటీ అని, ఎలాంటి పరిశీలనకైనా తాము మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సహకరిస్తామని, రెగ్యులేటర్ అడిగిన అన్ని వివరాలను పంచుకుంటామని పేర్కొంది. మెుత్తం 26 స్కీమ్స్ 54 లక్షల ఫోలియోలతో ఈ ఏడాది జనవరిలో నిర్వహణ కింద ఉన్న ఆస్తుల విలువ ఏకంగా రూ.50,000 కోట్లను దాటింది. ప్రస్తుతం క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏకంగా రూ.20,000 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్‌లో ఉన్నాయి.
అసలు ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏమిటి?
ప్రఖ్యాత మ్యూచువల్ ఫండ్ సంస్థపై సెబీ ఫ్రంట్ రన్నింగ్ అనుమానాలను వ్యక్తం చేయటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే.. వాస్తవానికి ఇదొక అనైతిక పద్ధతి. ఎవరైనా బ్రోగర్ లేదా ట్రేడర్ తన ప్రయోజనం కోసం ట్రేడ్ చేయడానికి పెండింగ్‌లో ఉన్న క్లయింట్ ఆర్డర్‌ల గురించి రహస్య సమాచారాన్ని ఉపయోగించుకుంటాడు. "ఫ్రంట్ రన్నింగ్" అంటే ఊహించిన ధర నుంచి లాభం పొందడానికి పెద్ద ఆర్డర్‌కు ముందు ఆర్డర్ చేయడం. ఇది వారి క్లయింట్‌ల ఉత్తమ ప్రయోజనాల కంటే బ్రోకర్ లేదా వ్యాపారి ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తుంది. అయితే ఇలాంటి ట్రేడింగ్ పద్ధతులు మార్కెట్ సమగ్రతను దెబ్బతీయటంతో పాటు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.


Click it and Unblock the Notifications