Mukesh Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్తల్లో ప్రధానంగా కనిపిస్తోంది. కంపెనీ వేగవంతమైన నిర్ణయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు ఇన్వెస్టర్ల ఆసక్తిని పెంచుతున్నాయి.
తాజాగా అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ ముందుకొచ్చింది. కంపెనీలో చిన్న వాటాను కొనుగోలు చేసేందుకు ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఇప్పటికే చర్చలు జరుపుతోందని సమాచారం. ఇదే క్రమంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ ఆదాయం 20 శాతం పెరిగి రూ.69,948 కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 555 స్టోర్లు ప్రారంభించి ఇది రిలయన్స్ సామ్రాజ్యాన్ని పనితీరుతో కాపాడింది.

ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్‌లో ముఖేష్ అంబానీ షేర్ల విక్రయం పెట్టుబడులను ఆకర్షిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న. రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్(O2C) సెగ్మెంట్ పేలవ పనితీరు కనబరుస్తున్న తరుణంలో.. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(QIA) పెట్టుబడిని O2Cకి మళ్లించాలని ముకేశ్ అంబానీ యోచిస్తున్నారు. ఇదే క్రమంలో సౌదీ అరామ్‌కో భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. దీనికి తోడు ఇటీవల రిలయన్స్ తన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాన్ని డీమెర్జ్ చేసింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(QIA) రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో సుమారు 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టవచ్చని తెలుస్తోంది. దీంతో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు పెరగనుంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనేది కిరాణా, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్‌లో రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కింద అజియో, జియోమార్ట్ మాత్రమే కాకుండా వివిధ దుస్తుల బ్రాండ్లు, సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీని ఇషా అంబానీ, ముఖేష్ అంబానీ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications