IPO News: సూపర్ ప్రీమియం ధరకు లిస్టైన ఐపీవో.. ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు..
Pyramid Technoplast: పిరమిడ్ టెక్నోప్లాస్ట్ ఐపీవో షేర్లు నేడు మార్కెట్లో లిస్టింగ్ జరిగింది. ఈ క్రమంలో 13 శాతం ప్రీమియం ధరకు స్టాక్ జాబితా చేయబడింది. దీంతో ఇష్యూ ధర కంటే మంచి రాబడులను ఇన్వెస్టర్లు తొలిరోజే అందుకున్నారు.
ఎన్ఎస్ఈలో కంపెనీ ఒక్కో షేరు రూ.187 ధరకు జాబితా చేయబడింది. అలాగే బీఎస్ఈలో షేర్ 11.45 శాతం ప్రీమియం ధరకు రూ.185 వద్ద లిస్టింగ్ జరిగింది. కంపెనీ పెట్టుబడిదారులకు షేర్లను రూ.166 రేటుకు అలాట్ చేసింది. దీంతో మార్కెట్లో మంచి ధరకు స్టాక్ అరంగేట్రం చేసింది. కంపెనీ ఐపీవోలో 92.2 లక్షల షేర్లను ఇష్యూ చేయగా బిడ్డింగ్ రూపంలో 13.83 కోట్ల షేర్లకు దరఖాస్తులు అందాయి. దీంతో ఐపీవో 18.29 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ చేయబడింది.

రిటైల్ కేటగిరీ 14.72 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను చూడగా.. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(NII) కేటగిరీ 32.24 రెట్లు సభ్యత్వాన్ని పొందింది. ఇక చివరగా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) కేటగిరీ 9.94 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. ఐపీవోలో రూ.91.30 కోట్ల విలువైన 55 లక్షల షేర్ల తాజా ఇష్యూ ఉండగా.. మిగిలిన రూ.61.75 కోట్ల విలువైన 37.20 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్(OFS) రూపంలో ఉంది. మెుత్తంగా ఐపీవో నుంచి కంపెనీ రూ.153.05 కోట్లను సమీకరించింది. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో స్టాక్ 7 శాతానికి పైగా లాభపడి రూ.177.65 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.
1997లో స్థాపించబడిన Pyramid Technoplast పాలీమర్ ఆధారిత అచ్చు ఉత్పత్తుల తయారీలో ప్రత్యేకత కలిగి ఉంది. ప్యాకేజింగ్ కోసం ప్రధానంగా రసాయన, వ్యవసాయ రసాయన, స్పెషాలిటీ కెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాలను అందిస్తుంది. కంపెనీ 1998లో దాని వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. తాజా ఐపీవోలో కార్నెలియన్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఫండ్, ఆల్కెమీ వెంచర్స్ ఫండ్, ప్లూరిస్ ఫండ్, రెసొనెన్స్ ఆపర్చునిటీస్ ఫండ్ యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications