Diwali Gift: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వన్-టైమ్ సెటిల్ మెంట్ సుపరిచితమే. ఏవైనా బకాయిలను ప్రజల నుంచి వేగంగా రాబట్టేందుకు ప్రభుత్వాలు ఈ టెక్నిక్ వినియోగిస్తుంటాయి. ఇదే సమయంలో కొంత డిస్కౌంట్ సైతం ఇస్తుండటంతో సదరు చెల్లింపుదారులు పెద్దఎత్తున స్పందించే అవకాశం లభిస్తుంది. సరిగ్గా ఇదే టెక్నిక్ ను GSTకి అప్లై చేసింది ఓ రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలోని వ్యాపారులకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రీ-GST బకాయిల వసూళ్లకు క్యాబినెట్ వన్-టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకాన్ని ఆమోదించింది. దీని ద్వారా 60 వేల మంది వ్యాపారులకు ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం చెబుతోంది. కేసుల భారాన్ని తగ్గించేందుకు వీలుగా బకాయిల రికవరీ కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు CM కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు.

నవంబర్ 15 నుంచి ఈ OTS వర్తించనుంది. కాగా మార్చి 15, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. మార్చి 31, 2023 వరకు మొత్తం డిమాండ్ (పన్ను, పెనాల్టీ మరియు వడ్డీ) 1 కోటి వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కింద సెటిల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మార్చి 31, 2023 నాటికి దాదాపు 39 వేల 787 కేసుల్లో బకాయి మొత్తం 1 లక్ష వరకు ఉంది. వీటికి OTS ద్వారా పంజాబ్ ప్రభుత్వం పూర్తి మాఫీ అందిస్తుంది. ఇక మరో 19 వేల 361 కేసులకుగాను వడ్డీ 100 శాతం, జరిమానా 100 శాతం మరియు పన్ను మొత్తంలో 50 శాతం మాఫీ చేయనుంది.


Click it and Unblock the Notifications