Pulses Inflation: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పప్పుల ధరలు..!
ఆకాశాన్నంటుతున్న ఆహార పదార్థాల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు శుభవార్త వచ్చింది. దాదాపు ఏడాది కాలంగా పెరుగుతూ వస్తున్న పప్పుల ధరలు ఇప్పుడు తగ్గడం ప్రారంభించాయి. రానున్న నెలల్లో పప్పుల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. గత నెల రోజులుగా దేశంలోని వివిధ మార్కెట్‌లలో పప్పుల ధరలు తగ్గుముఖం పట్టాయని జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.
కందిపప్పు, పెసర పప్పు, మినప పప్పుల ధరలు తగ్గుతున్నాయని ఓ నివేదిక పెర్కొంది. పప్పుల రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 19.54 శాతం ఉండగా.. జూన్‌లో 16.07 శాతానికి తగ్గింది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. కంది పప్పు రిటైల్ ధరలు శనివారం కిలోకు రూ.160కి తగ్గాయి. నెల క్రితంతో పోలిస్తే ఇది 5.8 శాతం తగ్గుదల నమోదు అయింది. మైసూర్ పప్పు నెల క్రితం కంటే 10 శాతం తగ్గింది. శనివారం కిలో రూ.90కి తగ్గింది.

గత నెల రోజులుగా ప్రధాన మండీల్లో కందిపప్పు, ఇతర పప్పు ధరలు 4 శాతం తగ్గాయని అధికారులు చెబుతున్నారు. రానున్న నెలల్లో పప్పుల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల దిగుమతులు పెరగడమే ధరలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. పప్పుల ధరలను నియంత్రించడానికి, కంది పప్పు, పెసర పప్పు, మైసూర్ పప్పుల సుంకం రహిత దిగుమతిని ప్రభుత్వం 31 మార్చి 2025 వరకు పొడిగించింది.
దీంతో పప్పుల దిగుమతి పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 4.73 మిలియన్ టన్నుల పప్పులను దిగుమతి చేసుకుంది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే 90 శాతం ఎక్కువ. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం కూడా హోర్డింగ్‌పై కఠిన వైఖరిని తీసుకుంది. సెప్టెంబరు 30 వరకు కంది పప్పు, శనగ పప్పు స్టాక్ పై పరిమితి విధించారు. ఇది లభ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.


Click it and Unblock the Notifications