LPG Cylinder: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే..!
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) సిలిండర్ ధరను పెంచాయి. నేటి (1 మార్చి, శుక్రవారం) నుంచి 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.25 పెంచాయి. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,795గా ఉంది. ముంబైలో 19 కిలోల సిలిండర్ రూ.1,749కి విక్రయిస్తున్నారు. చెన్నై రూ. 1,960 ఉండగా.. కోల్‌కతాలో రూ.1,911కి పెరిగింది. హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,925గా ఉంది.
ప్రభుత్వరంగ సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం వరుసగా ఇది రెండోసారి. ఫిబ్రవరి 1న, 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు రూ.14 పెరిగాయి. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను 1 డిసెంబర్ 2023న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రూ.21 పెంచాయి. అయితే, నూతన సంవత్సరం 2024 సందర్భంగా, 19 కిలోల వాణిజ్య వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు రూ.39.50 తగ్గించారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గత నెలలోని సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. వాణిజ్య సిలండర్లు అంటే హోటళ్లు, రెస్టారెంట్ కిచన్లలో వాడే సిలిండర్లు వీటి బరువు 19 కేజీలు ఉంటుంది. ఇక గృహ వినియోగ సిలిండర్లు అంటే.. సామాన్యం జనం వాడే సిలిండర్లు. ఇవి 14 కేజీల బరువు ఉంటాయి.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 లకే గృహవినియోగ సిలిండర్లు అందిస్తోంది. ఈ ఫథకం రేషన్ కార్డు ఉన్నవారికే వర్తిస్తుంది. కాగా గతంలో కేంద్రం కూడా డొమెస్టిక్ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తుండే. ఇది క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు కేవలం ఉజ్వల పథకం కింద కనెక్షన్ తీసుకున్నవారికే సబ్సిడీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications