LIC News: కుప్పుకూలిన టెక్ కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడుల పెంపు.. పూర్తి వివరాలు..
LIC News: ప్రభుత్వ రంగంలోని దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ. ప్రజల నుంచి సేకరించిన పాలసీ సొమ్మును అనేక మార్గాల్లో పెట్టుబడులు పెట్టి పాలసీదారులకు మంచి రాబడులను అందించటంలో ఈ సంస్థ మంచి పేరుగాంచింది.
ఇటీవల అనేక ఆరోపణలతో కుప్పకూలిన అదానీ గ్రూప్ కంపెనీల్లో తన పెట్టుబడులను పెంచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎల్ఐసీ. దీనిపై అనేక ఆరోపణలు, రాజకీయ వివాదాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నాలుగో త్రైమాసికాలు విడుదలతో కుప్పకూలిన టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా ఇన్సూరెన్స్ దిగ్గజానికి పెట్టుబడులు ఉన్నాయి.

మార్చి 31, 2023తో ముగిసే త్రైమాసికానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన షేర్ హోల్డింగ్ వివరాలను విడుదల చేసింది. ఇందులోని సమాచారం ప్రకారం ఎల్ఐసీ కొత్త పెట్టుబడుల ద్వారా ఇన్ఫోసిస్ కంపెనీలో వాటాలను పెంచుకున్నట్లు వెల్లడైంది. ఇన్ఫోసిస్‌లో 29,82,44,977 ఈక్విటీ షేర్లను అంటే 8.19% వాటాను ఎల్ఐసీ కలిగి ఉంది. అంతకు ముందు త్రైమాసికంలో ఎల్ఐసీకి కేవలం 7.71% వాటాలు మాత్రమే ఉన్నాయి.
అలాగే ఇన్ఫోసిస్ కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 68.95% వాటాలను కలిగి ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు కలిసి 31.33% వాటాను కలిగి ఉన్నాయి. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 1.30%, SBI లైఫ్ ఇన్సూరెన్స్ 1.19% టెక్ కంపెనీలో పెట్టుబడులను కలిగి ఉన్నాయి. వీటికి తోడు హెచ్డీఎఫ్సీ, యూటీఐ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్టీ పెట్టుబడులు పెట్టిన టాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలుగా నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్ఫోసిస్ షేర్ల పతనం కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. షేర్ ధర కనిష్ఠాలను తాకటంతో ఎల్ఐసీ సైతం కోట్లలో సంపదను కోల్పోయిందని తెలుస్తోంది. అలాగే పెట్టుబడులు పెట్టిన ఇతర మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం నష్టాల సెగను చవిచూశాయి.


Click it and Unblock the Notifications