పవర్ వ్యాపారంలో అదానీ గ్రూప్ దూకుడుగా వ్యవహరించటం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వేగం కేవటం అదానీ కంపెనీలకు మాత్రమే కాక వారి నుంచి ఆర్డర్లు పొందుతున్న కంపెనీలకు సైతం ఉపయోగపడుతోంది.
నేడు స్టాక్ మార్కెట్లలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో 1.94 శాతం మేర లాభంతో రూ.99.90 వద్ద కొనసాగుతోంది. ఇంట్రాడేలో స్టాక్ అత్యధికంగా రూ.100.25 స్థాయిని చేరుకుంది. కంపెనీకి అదానీ పవర్ యూనిట్ నుండి పెద్ద ఆర్డర్ పొందటమే దీనికి కారణంగా నిలిచింది.

మధ్యప్రదేశ్‌లోని పవర్ ప్రాజెక్ట్ కోసం అదానీ పవర్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ నుంచి రూ.4,000 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు BHEL తెలిపింది. ఇది మహాన్ ఎనర్జీ లిమిటెడ్ పవర్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించటంతో పాటు, అవసరమైన పరికరాలను సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఆర్డర్ 31-35 నెలల్లో అమలు చేయబడుతుందని BHEL స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. టర్బైన్ జనరేటర్లను బీహెచ్‌ఈఎల్‌కు చెందిన తిరుచ్చి, హరిద్వార్ ప్లాంట్‌లలో తయారు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
2022-23లో కంపెనీ వ్యాపార విధానం కారణంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే అందుకున్న కొత్త ఆర్డర్‌లలో 17 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ.23,548 కోట్ల ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. 2021-22లో కంపెనీ రూ.20,078 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లను పొందింది.
ఆర్థిక పనితీరును పరిగణలోకి తీసుకుంటే.. ప్రభుత్వ రంగ సంస్థ జూన్ త్రైమాసిక నష్టం రూ.343.89 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ నష్టాలు పెరిగినట్లు వెల్లడైంది. దీనికి ముందు గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీకి ఏకీకృత నికర నష్టం రూ.187.99 కోట్లుగా ఉండేది. ఈ త్రైమాసికంలో మొత్తం ఖర్చులు రూ.5,006.50 కోట్ల నుంచి రూ.5,595.47 కోట్లకు పెరిగినట్లు కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం తెలిసింది.


Click it and Unblock the Notifications