ముంబై: దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ కంపెనీ.. భారత్‌లో పెట్టుబడులను పెట్టనుంది. అంతర్జాతీయంగా మొబైల్ గేమింగ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న పబ్జీని సృష్టించింది ఈ సంస్థే. భారత్ మొబైల్ గేమింగ్ సెక్టార్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం నోడ్విన్ గేమింగ్ కంపెనీలో పెట్టుబడులను పెట్టనుంది. 22.4 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యంతో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.
ఈ విషయాన్ని నోడ్విన్ గేమింగ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అక్షత్ రాఠీ ధృవీకరించారు. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్‌తో కలిసి మొబైల్ గేమింగ్ ప్రాజెక్టులను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. హర్యానాలోని గుర్‌గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న సంస్థ ఇది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నెలకొల్పిన నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్ నెలకొల్పిన జెట్ సింథెసిస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇది అనుబంధంగా పనిచేస్తోంది.

భారత మార్కెట్‌లో తాము పునఃప్రవేశిస్తామంటూ గత ఏడాది నవంబర్‌లోనే క్రాఫ్టన్ కంపెనీ వెల్లడించిన విషయం తెలిసిందే. పబ్జీ కార్పొరేషన్ పేరుతో భారత్‌లో కార్యకలాపాలను నిర్వహించింది. అనంతరం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో నిషేధాన్ని ఎదుర్కొంది. అనంతరం క్రాఫ్టన్ కంపెనీ.. చైనాకు చెందిన టెన్సెంట్ గేమింగ్‌తో తెగదెంపులు చేసుకుంది. ఫలితంగా- మరోసారి దేశీయ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి అవకాశం లభించింది. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తన పెట్టుబడుల కోసం భారత కంపెనీనే ఎంచుకుంది.
మళ్లీ రీఎంట్రీ ఇస్తామని గత నవంబర్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా.. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. దీనికోసం దేశీయ కంపెనీలను ఎంచుకుంటోంది. మొత్తం వంద మిలియన్ డాలర్ల మేర పెట్టబడులను పెట్టాలని క్రాఫ్టన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. తొలిదశలో నోడ్విన్ గేమింగ్‌లో 22.4 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నామని వెల్లడించింది. దశలవారీగా లోకల్ వీడియో గేమింగ్, ఇ-స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఐటీ ఇండస్ట్రీలకు తమ ఇన్వెస్ట్‌మెంట్లను విస్తరించబోతోంది.


Click it and Unblock the Notifications