Q3 Results: క్యూ3లో బ్యాంక్ ఆఫ్ బరోడా కళ్లు చెదిరే లాభాలు.. పూర్తి వివరాలు..
Bank of Baroda: దేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థలు తమ ఉత్తమ పనితీరును లాభాల రూపంలో కనబరుస్తున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది.
మార్కెట్ క్యాప్ పరంగా దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా అక్టోబర్-డిసెంబర్ కాలానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో స్టాండ్ అలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.4,579.3 కోట్లుగా నివేదించింది. గత ఏడాది ఇదే కాలం కంటే 18.9 శాతం పెరిగింది. ఈ ప్రకటనతో నేడు స్టాక్ బీఎస్ఈలో రికార్డు గరిష్ఠమైన రూ.246.5 స్థాయిని తాకింది.

తాజా రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం కంపెనీ వడ్డీ ఆదాయం రూ.11,101.3 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. డిసెంబర్ త్రైమాసికానికి బ్యాంక్ ఆఫ్ బరోడా త్రైమాసిక స్వతంత్ర నికర లాభం రూ.4,200 కోట్లు, NII రూ.11,044 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ఫలితాలు మాత్రం నిపుణుల అంచనాలకు మించి రావటం పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అలాగే ఈ కాలంలో ప్రభుత్వ బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్రమంగా మెరుగుపడింది.
డిసెంబరు త్రైమాసికంలో బ్యాంకు వద్ద ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు అంటే మొండి బకాయిలు.. మూడు నెలల క్రితం 3.32 శాతం నుంచి మొత్తం రుణాలలో 3.08 శాతానికి తగ్గాయి. ఇక నెట్ ప్రాతిపదికన మెుండి బకాయిలు 0.76 శాతం నుంచి స్వల్పంగా 0.70 శాతానికి మెరుగుపడ్డాయి. అలాగే నేడు మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ ధర 4.53 శాతం లాభంతో రూ.248.20 వద్ద ట్రేడయ్యాయి.


Click it and Unblock the Notifications