PSBs: భారత బ్యాంకింగ్ రంగంలో నూతనోత్సాహం.. జెట్ స్పీడు మీదున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు
PSBs: అమెరికాలో ఇటీవల బ్యాంకులు దివాళా తీశాయి. తద్వారా ప్రపంచ బ్యాంకింగ్ రంగం ఒకింత ఒత్తిడికి గురైంది. ఇదే సమయంలో ఇండియన్ బ్యాంకుల మీద కూడా దీని ప్రభావం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ, ప్రభుత్వరంగ బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి.
జూన్ 2023తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 34 వేల 774 కోట్లకు పైగా లాభాలను నమోదు చేశాయి. తద్వారా మరోసారి రెట్టింపు ఆదాయం సాధించి అద్భుతమైన పనితీరును కనబరిచాయి. గతేడాది ఇదే సమయంలో మొత్తం 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 15 వేల 306 కోట్ల లాభం రిపోర్ట్ చేశాయి. కాగా ఇప్పుడు దాన్ని కాస్తా డబుల్ చేసి తమ సత్తా చాటాయి.నికర వడ్డీ మార్జిన్(NIM) పొందేందుకు ఈ త్రైమాసికంలో ఉపయోగించిన అధిక వడ్డీ విధానం.. లాభాలు పెరగడానికి సహాయపడినట్లు బ్యాంకులు తెలిపాయి. పూణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 3.86 శాతం, సెంట్రల్ బ్యాంక్ 3.62 మరియు ఇండియన్ బ్యాంక్ 3.61 చొప్పున NIM నమోదు చేశాయి.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొత్తం 4 బ్యాంకులు 100 శాతం కంటే ఎక్కువ లాభాలను పొందాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధికంగా 307 శాతం వృద్ధి సాధించగా.. SBI 178, బ్యాంక్ ఆఫ్ ఇండియా 176 శాతం చొప్పున లాభాలు ఆర్జించాయి. మరో 5 PSBలు 50 నుంచి 100 శాతం మధ్య వృద్ధి సాధించాయి.
ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు PSBల పునరుద్ధరణకు దోహదపడినట్లు తెలుస్తోంది. 4R గుర్తింపు, రిజల్యూషన్, రీక్యాపిటలైజేషన్, సంస్కరణల ఫలితంగా ఈ ఫీట్ సాధ్యమైనట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తం అడ్వాన్స్‌లలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు(NPA)లు సైతం 10 ఏళ్ల కనిష్ఠానికి దిగజారాయి. గత 8 సంవత్సరాల్లో 8.6 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలనూ రికవరీ చేయగలిగాయి.


Click it and Unblock the Notifications