Gold: జువెలరీ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? ఇది ఉంటే మీ బంగారం పోతుందన్న భయం ఉండదు!
భారతదేశంలో బంగారు నగలు(gold jewellery) అంటే కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు. తరతరాలుగా వస్తున్న భారీ పెట్టుబడి కూడా. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న పండుగలు, వివాహాల సీజన్‌లో చాలామంది కొత్తగా నగలు కొంటుంటారు. మరి పొరపాటున నగలు పోతే పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు చాలామంది జువెలరీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇదెలా ఉంటుందంటే..

ఇటీవల బంగారం ధర(gold rate) రూ.1.20 లక్షల (10 గ్రాములు) మార్కును చేరుకుంది. ఇంత విలువైన బంగారాన్ని దొంగతనం లేదా అగ్ని ప్రమాదాల వంటి విపత్తుల నుంచి రక్షించుకోవడం ముఖ్యం. అందుకే ఇప్పుడు చాలామంది జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇది తీసుకుంటే మీ బంగారం పోతుందన్న భయం ఉండదు. ఈ పాలసీ ఎలా పని చేస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హోం ఇన్సూరెన్స్ సరిపోదా?
సాధారణంగా చాలామంది హోం ఇన్సూరెన్స్ (Home Insurance) తమ బంగారాన్ని కవర్ చేస్తుందని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. ఇంటి బీమా బంగారు ఆభరణాల్లో కొంత భాగాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. మీ నగలకు తగ్గ పూర్తి పరిహారం దక్కకపోవచ్చు. హోమ్ ఇన్సూరెన్స్ తరచుగా దొంగతనాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కానీ, ప్రయాణాల్లో బంగారం పోయినా లేదా యాక్సిడెంటల్ డ్యామేజ్ వంటివి జరిగినా హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు.
జువెలరీ ఇన్సూరెన్స్ ఎందుకంటే..
జువెలరీ ఇన్సూరెన్స్(jewellery insurance) అనేది కేవలం బంగారు నగల కోసం రూపొందించిన ఇన్సూరెన్స్. ఈ బీమా పాలసీలు మీ బంగారు, వజ్రాలు, రత్నాల ఆభరణాలకు ప్రొటెక్షన్ ఇస్తాయి. ఇది బంగారు ఆభరణాల మార్కెట్ విలువకు అనుగుణంగా పూర్తి కవరేజీని అందిస్తుంది. మీరు ఆభరణాలను ఇంట్లో దాచుకున్నా, బ్యాంకు లాకర్‌లో ఉంచినా, లేదా పెళ్లిళ్లకు/ప్రయాణాలకు ఒక చోటు నుంచి మరో చోటుకు రవాణా చేస్తున్నా పూర్తి రక్షణ లభిస్తుంది. అలాగే ఊహించని నష్టాలకు కూడా కవరేజీ ఇస్తుంది. దొంగతనం లేదా దోపిడీ. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాలను కూడా ఇది కవర్ చేస్తుంది.
పాలసీ ఇలా..
ఈ భీమా పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు అలాగే క్లెయిమ్‌లను కూడా డిజిటల్ పద్ధతిలోనే త్వరగా పరిష్కరించుకోవచ్చు. ఒకే పాలసీ కింద మీ మొత్తం కుటుంబ ఆభరణాల సేకరణను కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పండుగ, పెళ్లిళ్ల సీజన్లో బీమా తీసుకోవడం బెటర్. ఎందుకు ఈ సీజన్ లోనే ఆభరణాలు పొరపాటున పోయే ప్రమాదం ఉంటుంది. పైగా ఈ సీజన్ లో బీమా పాలసీలపై సీజనల్ ఆఫర్లు ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో జ్యువెలరీ ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.500 కోట్లుగా ఉంది. బంగారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జువెలరీ ఇన్సూరెన్స్ కు కూడా డిమాండ్ పెరుగుతుంది.


Click it and Unblock the Notifications