Real Estate News: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో హైదరాబాదు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ పరిశ్రమల సంస్థలు తమ కొత్త ఆఫీసులను ఈ నగరానికి తరలిస్తుండటంతో ఉద్యోగులు అధిక స్థాయిలో ఉపాధి కోసం నగరానికి చేరుకుంటున్నారు. దీనికి తోడు చిన్నాపెద్దా ఐటీ కంపెనీల్లో కొలువుల కోసం లేదా కోర్సులు నేర్చుకోవటం కోసం యువత సైతం నగరాన్ని తమ ఉత్తమ ఎంపికగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అమాంతం పెరిగిపోతున్నాయి. కేవలం గడచిన మూడు నెలల కాలంలోనే ఇళ్ల అద్దెలు ఏకంగా 4 శాతం వరకు పెరిగాయని తేలింది. నగరంలో ప్రధానంగా ఐటీ కారిడార్ దగ్గరలో, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో అద్దెలు క్రమంగా పెరిగిపోతున్నాయని ప్రముఖ సంస్థ అనరాక్ అధ్యనంలో వెల్లడైంది. ఈ క్రమంలో నగరంలోని కొండాపూర్, జూబ్లిహిల్స్, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో అద్దెలు నెలకు రూ.50 వేలకు పైనే పలుకుతున్నాయని వెల్లడైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగరంలోని ప్రైమ్ ఏరియాలుగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో కూడా రెంట్స్ భారీగా పెరిగాయి.

హైటెక్ సిటీ చుట్టుపక్క ప్రాంతాల్లో 2021లో రూ.23 వేలుగా ఉన్న అద్దె ప్రస్తుతం రూ.33,500 వరకు పలుకుతోంది. ఇదే క్రమంలో గచ్చిబౌలి విషయానికి వస్తే 2021లో అద్దె రూ.22 వేలు ఉండగా అది ఈ ఏడాది మధ్య నాటికి రూ.33 వేలకు పెరిగిపోయింది. ఈ ఏడాది మెుదటి త్రైమాసికంలో 2 బెడ్ రూమ్స్ ఇంటి అద్దెలు సగటున ఈ రెండు ప్రాంతాల్లో 5 శాతం వృద్ధిని చూశాయి. అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు హైదరాబాదులో ఇంటి అద్దెలు ఏకంగా 64 శాతం పెరుగుదలను చూశాయి. ప్రస్తుతం నగరానికి ఐటీ కంపెనీలతో పాటు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల రాక పెరగటంతో ఇళ్లతో పాటు కమర్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలిలలో నిరంతరాయంగా డిమాండ్ పెరుగుతూనే ఉంది.
హైదరాబాదులో రియల్ ఎస్టేట్ గ్రోత్ నికరంగా కొనసాగుతుందని ప్రస్తుతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గడచిన కొన్ని నెలలుగా ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ చెరువుల ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకురావటంతో కొత్త కొనుగోలుదారులు కొంత వెనకాడుతున్నారు. ప్రాపర్టీలు కొన్నాక లిటిగేషన్స్ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ఇతర రాష్ట్రాలకు చెందిన సెటిలర్లు, కొత్తగా నగరానికి మారాలనుకుంటున్న చాలా మంది వెనుకాడుతున్నారు. ప్రస్తుతం హైడ్రా కొంత దూడుకు తగ్గించిన వేళ పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వచ్చి కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇంటి అద్దెలు సైతం భారీగానే పెరుగుతున్న వేళ కొందకు ముందుగానే మేల్కొని ఒక ఇల్లు కొనుక్కోవటం చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. అయితే హైదరాబాదులో ప్రస్తుతం ఏమూలన ఒక 3 బెడ్ రూమ్స్ కలిగిన ఇల్లు కొనాలంటే దాదాపు కోటి రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. మార్కెట్లో వస్తువుల రేట్లు పెరుగుదలతో పాటు డిమాండ్ పెరగటం ప్రస్తుతం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇది చూడబోతుందే లక్షాధికారులే హైదరాబాదులో ఇంటి అద్దెలు కట్టగలరేమో అనిపిస్తోంది. భవిష్యత్తులో సామాన్యులు ఈ నగరంలో అద్దెకు ఉండటానికి సైతం ఆలోచించాల్సిన స్థాయిలకు పరిస్థితులు చేరుకోవచ్చని చాలా మంది వాపోతున్నారు.


Click it and Unblock the Notifications