Robert Kiyosaki: బంగారం ధరకు బ్రేకులు పడడం కష్టమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాబర్ట్ కియోసాకి..!
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం రోజు 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏకంగా రూ.4 వేలకు పైగా పెరిగింది. ఈ నేపథ్యంలో పసిడి ధర ఇంకా పెరుగుతుందా అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అటూ అంతర్జాతీయంగా కూడా పుత్తడి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ భారీగా పుంజుకుని ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయిని దాటింది. పసిడి ధర పెరుగుదలపై రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి స్పందించారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలని తాను ఏళ్లుగా సూచిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం బంగారం ధర 4,400 డాలర్ల స్థాయిలో ఉందని గుర్తు చేసిన కియోసాకి.. ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని కోరారు. ఇటీవల భారీ పతనం తర్వాత బంగారం మళ్లీ పుంజుకుందని, ఆగస్టులోనే ధర సుమారు 9 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు 19న స్పాట్ గోల్డ్ 4,487.91 డాలర్లకు చేరగా, 20న లాభాల స్వీకరణతో 4,484.95 డాలర్లకు తగ్గిందని వివరించారు. పసిడి ధర పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఉద్రిక్తతలు అని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న పరిస్థితులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు వంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచాయని తెలిపారు.

ఇలాంటి క్లిష్ట సమయాల్లో పెట్టుబడి దారులు సాధారణంగా సురక్షితమైన పెట్టుబడి వైపు వెళ్తారని.. అందులో భాగంగానే పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయని అంచనా వేశారు. దీంతో పాటు అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గదుల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు ఉండవన్న అంచనాలతో బంగారం ధర 4,400 డాలర్లకు చేరినట్లు అంచనా వేశారు.
బంగారం ధర పెరుగుదలకు మరో కారణం సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడి కొనుగోలు చేయడమని రాబర్ట్ కియోసాకి వివరించారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. చైనా, జపాన్, భారత్, పోలాండ్, టర్కీ, సింగపూర్ దేశాలు బంగారాన్ని భారీగా కొనుగోలు చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా ప్రతి నెలా బంగారం కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అందుకే పసిడి ధరలు దూసుకెళ్తున్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే బంగారం ధర పెరుగుదలతో చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్ ల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా పసిడి పరుగుకు కారణంగా చెప్పుకొచ్చారు.
తాను ఔన్సు బంగారం 300 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. వెండి ధర తక్కువగా ఉన్నప్పుడు, బిట్‌కాయిన్‌ను 6,000 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కొనుగోలు చేసినట్లు వివరించారు.బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు. నిజమైన డబ్బని రాబర్ట్ కియోసాకి స్పష్టం చేశారు. బంగారం విలువ పెరుగుతందే తప్ప తగ్గదన్నారు. ఒక వేళ తగ్గిన స్వల్పకాళిమేనని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ఇలానే ఉంటే పసిడి పరుగు ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. అందుకే బంగారంలో పెట్టుబడి పెట్టడం విలువైన నిర్ణయంగా అభివర్ణించారు. అయితే ఏదైనా తక్కువ ధర ఉన్నప్పుడు పెట్టుబడి పెడితేనే అధిక లాభం వస్తుందని వివరించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications