ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రం నజర్ .. ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ సాధ్య
కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు సై అంటుంది . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాలు విక్రయించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకురావాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం అధికారులను కోరింది.
పంజాబ్ & సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో బ్యాంక్ మరియు ఐడిబిఐ బ్యాంక్ లలో ప్రత్యక్ష మరియు పరోక్ష హోల్డింగ్స్ ద్వారా భారత ప్రభుత్వం మెజారిటీ వాటాను కలిగి ఉంది. ఈ బ్యాంకులలో ప్రభుత్వ వాటాలను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది .2021 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపే ఈ బ్యాంకుల ప్రైవేటీకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ప్రధాని కార్యాలయం ఈ నెల ప్రారంభంలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసిందని సమాచారం. ప్రధాని కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది.బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ తీరు దూకుడుగా ఉందని తెలుస్తుంది.

బ్యాంకింగ్ పరిశ్రమ యొక్క సమగ్ర మార్పులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను కేవలం ఐదుకి తగ్గించడానికి భారత ప్రభుత్వం . ప్రభుత్వ అధీనంలోని సగం బ్యాంకులను ప్రైవేటీకరించాలని చూస్తున్నట్లు గతంలోనే పేర్కొంది . అయితే కరోనా సంక్షోభంతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం భారీగా తగ్గింది. దాంతో పీఎస్‌బీలు, సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఆదాయ లోటును పూడ్చుకోవాలని మోదీ సర్కారు భావిస్తోంది. కానీ ఈ ఏడాది ప్రైవేటీకరణ సాధ్యపడకపోవచ్చని అంటున్నారు .
ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద భారీగా పేరుకుపోయిన మొండి బకాయిలు ఉన్నాయి. అంతేకాదు ప్రస్తుత కరోనా కాలంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంతో మొండి బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంత సాధ్యం కాకపోవచ్చని , దానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


Click it and Unblock the Notifications