Vodafone Idea: వొడఫోన్ ఐడియా ఇన్వెస్టర్లకు శుభవార్త.. మూడేళ్లకు మెగా ప్లాన్ ఇదే..
Vodafone Idea Shares: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో టెలికాం కంపెనీల హవా కొనసాగింది. ప్రధానంగా ఎయిర్ టెల్ కంపెనీ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచిన వేళ వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్లు కూడా లాభపడ్డాయి. ఇదే క్రమంలో చాలా కాలంగా మార్కెట్లో కొనసాగటానికి ఇబ్బందులు పడుతున్న విఐ స్టాక్ బంగారు భవిష్యత్తును చూడనున్నట్లు తెలుస్తోంది.
టెలికాం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియా షేర్లలో నేడు భారీ పెరుగుదల కనిపించింది. వారం చివరి ట్రేడింగ్ రోజున దాదాపు 3 శాతం పెరిగింది. అయితే ఎన్ఎస్ఈలో విఐ స్టాక్ రూ.8 వద్ద ట్రేడింగ్ ముగించింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు నవంబర్ 22న రూ.6.60 స్థాయికి దిగజారిన తర్వాత ప్రస్తుతం తిరిగి పుంజుకోవటానికి పెద్ద కారణం ఉంది. వొడాఫోన్ ఐడియా తన 4G, 5G నెట్‌వర్క్ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ.. దేశవ్యాప్తంగా కవరేజీని విస్తరించే పనిలో ఉంది. ఈ క్రమంలో కంపెనీ రానున్న 3 ఏళ్లలో రూ.50,000-రూ.55,000 కోట్లు మూలధన వ్యయం కోసం వెచ్చించనున్నట్లు ప్రకటించటంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు మద్దతు చూపారు.

వొడఫోన్ ఐడియా 2025 ఆర్థిక సంవత్సరం మెుదటి అర్థభాగంలో రూ.2,000 కోట్లకు పైగా క్యాపెక్స్ వ్యయం కోసం వెచ్చించినట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని ప్రధానంగా కంపెనీ 4జీ కవరేజీని మెరుగుపరచటం కోసం వినియోగించటంతో డేటా సామర్థ్యం 14 శాతం పెరిగింది. ఈ క్రమంలో కొత్తగా కంపెనీ 2.2 కోట్ల మంతి కస్టమర్లను పొందింది. అలాగే ఆర్థిక సంవత్సరం రెండవ అర్థభాగంలో నెట్‌వర్క్ విస్తరణ, సేవలను మెరుగుపరచటానికి రూ.8,000 కోట్లను వెచ్చించాలని మెగా ప్లాన్ కలిగి ఉంది. రానున్న కాలంలో కంపెనీ తన మెుబైల్ టారిఫ్ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు ఈ ఏడాది జూలైలో కంపెనీ తన టారిఫ్ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలో మెుబైల్ టారిఫ్ రేట్ల కంటే తక్కువగా ఉన్నందున టెలికాం ఆపరేటర్లు క్రమంగా రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఇది భవిష్యత్తులో కంపెనీలకు ఆదాయాల స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సెప్టెంబరుతో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అప్పుల భారంతో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా నష్టం రూ.7,175.9 కోట్లుగా నమోదైంది. అయితే గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం రూ.8,746.6 కోట్ల కంటే తక్కువగా ఉండగటం ఊరటను కలిగించే అంశం.
బ్రోకరేజీల అభిప్రాయం..
టెలికాం దిగ్గజానికి ప్రభుత్వ మద్దతు ఉందని బ్రోకరేజ్ సంస్థ తన నోట్స్‌లో పేర్కొంది. వొడాఫోన్ ఐడియా తన బ్యాడ్ ఫేజ్‌ను వదిలిపెట్టిందని బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది. మీడియం నుంచి లాంగ్ టర్మ్‌లో రూ.15 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ వెల్లడించింది. ఈ బ్రోకరేజ్ నోమురా ఇండియా గతంలో కంపెనీ షేర్లకు అందించిన 'న్యూట్రల్' రేటింగ్‌కి వ్యతిరేకంగా స్టాక్‌పై 'BUY' రేటింగ్ అందించింది. రానున్న కాలంలో కంపెనీ షేర్ల ధరలు రూ.15 స్థాయికి చేరుకోవచ్చని టార్గెట్ ధరను ప్రకటించింది.


Click it and Unblock the Notifications