ప్రయివేటీకరణతో అసలు వ్యాల్యూ.. అప్పుడే సమర్థవంతం, మరిన్ని ఉద్యోగాలు
ప్రయివేటురంగంలో సమర్థవంతమైన యాజమాన్యం, ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల వ్యూహాత్మక పెట్టుబడులను ఉపసంహరించుకునే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు (CPSEs) నిజమైన వ్యాల్యు సమకూరుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎకానమీకి ఊతమిచ్చేలా వీటికి అత్యధికవ్యాల్యూని తీసుకువస్తామన్నారు. వీటితో ఉత్పాదకత, ఉపాధి కల్పన రూపంలో ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రతిఫలం దక్కుతుందన్నారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రాధాన్యరంగాల్లోలేని వాటిని గుర్తించి సిఫార్సు చేసే బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించామన్నారు. లాభాల్లో ఉన్న షిప్పింగ్ కార్పొరేషన్‌ను ప్రయివేటీకరించడం వెనుక ఉన్న ఉద్దేశం, కారణాలు ఏమిటని లోకసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.

అప్పుడే సమర్థవంతంగా పని చేస్తాయి
జాతీయ భద్రత ఇతర అంశాల్ని నీతి ఆయోగ్ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సిఫార్సు చేస్తుందని నిర్మలమ్మ అన్నారు. వస్తు తయారీ, సేవల రంగాల్లో పోటీతత్వంలో కూడిన మార్కెట్లు అభివృద్ధి చెందిన తర్వాత అటువంటి రంగాల్లో ప్రభుత్వ పాత్రను తగ్గించుకుని, ప్రయివేటుకు అప్పగిస్తే మరింత సమర్థవంతంగా పని చేస్తాయన్నారు. 84 CPSes, వాటి అనుబంధ సంస్థలు 2019-20లో నష్టాలను నమోదు చేశాయన్నారు. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న FY22 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని ఉద్యోగాలు
వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటీకరిస్తే ఉపాధి, ఇతరసదుపాయాల నష్టం కలగకుండా ఒప్పందంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. దీని వల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని, ఉద్యోగాలు కోల్పోవడం ఉండదని చెప్పారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలి కమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను వ్యూహాత్మక రంగాలుగా కేంద్రం గుర్తించింది.

గ్లోబల్ ఎకనమిక్ ఔట్ లుక్
దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా నిర్మలమ్మ స్పందించారు. ప్రస్తుతానికి ముడి చమురుతో పాటు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, వంట గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే ప్రతిపాదనలు లేవన్నారు. జీఎస్టీ కౌన్సిల్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదన్నారు. అలాగే, అన్ని క్రిప్టోకరెన్సీలకు తాము తలుపులు మూయడం లేదని కూడా చెప్పారు. ఇదిలా ఉండగా, గ్లోబల్ ఎకనమిక్ ఔట్ లుక్‌కు సంబంధించి అమెరికా ట్రెజరీ సెక్రటరీతో నిర్మలా సీతారామన్ చర్చించారు.


Click it and Unblock the Notifications