Kotak Mahindra Bank: గతవారం రిజర్వు బ్యాంక్ ఆదేశాలకు భారీ పతనాన్ని చూసిన కోటక్ మహీంద్రా బ్యాంక్ శుభవార్త చెప్పింది. తాజాగా కంపెనీ మార్చి త్రైమాసిక ఫలితాల్లో బలమైన ఆదాయాన్ని నమోదు చేసింది. వాస్తవానికి కంపెనీ మార్కెట్ నిపుణుల అంచనాలను అధిగమించి మెరుగైన ఫలితాలను సాధించింది.
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజ కోటక్ మహీంద్రా బ్యాంక్ నేడు తన మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 18 శాతం పెరిగి రూ.4,133.3 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ నికర లాభం కేవలం రూ.3,496 కోట్లుగా నిలిచింది. ఇదే క్రమంలో నికర వడ్డీ ఆదాయం త్రైమాసిక కాలంలో గత ఏడాది కంటే 13 శాతం పెరిగి రూ.6,909 కోట్లుగా నమోదైంది. నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన 5.28 శాతంగా ఉన్నట్లు నివేదించింది.

మార్కెట్ అంచనాలకు మించి ఉత్తమ ఫలితాలను ప్రకటించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక్కో షేరుపై రూ.2 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను గమనిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరం నికర లాభం గత ఏడాది కంటే 26 శాతం పెరిగి రూ.13,782 కోట్లకు చేరుకుంది. అలాగే మార్చి 31, 2024తో ముగిసిన కాలానికి మెుత్త కస్టమర్ల సంఖ్య 5 కోట్లకు చేరుకుందని కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య గత ఏడాది ఇదే సమయానికి 4.1 కోట్లుగా ఉందని పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆస్తి నాణ్యత మెరుగుపడింది. వాస్తవానికి బ్లూమ్‌బెర్గ్ పోల్ సమయంలో కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.3,306.66 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. అయితే వీరి అంచనాలకు మించి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ అద్భుతమైన పనితీరును కనబరిచింది.


Click it and Unblock the Notifications