Axis Bank Q1 Results: జూన్ తో ముగసిన త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ సూపర్ లాభాలను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే లాభాలు భారీగా పెరిగాయి.
ఈరోజు క్యూ1 ఫలితాలను విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.5,790 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,125 కోట్లతో పోల్చితే 40 శాతం అధికం. ప్రస్తుతం వడ్డీ ఆదాయాలు పెరిగిన తరుణంలో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు గతంలో ఎన్నడూ చూడని లాభాలను నమోదు చేస్తున్నాయి.

నిపుణులు అంచనా వేసిన రూ.5,889 కోట్ల నికర లాభం మార్కును బ్యాంక్ అందుకోలేక పోయింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(NII) ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.11,959 కోట్లకు చేరుకుంది. Q1FY24 కోసం నికర వడ్డీ మార్జిన్ ఏడాది ప్రాతిపదికన 50 బేసిస్ పాయింట్లు పెరిగి 4.10 శాతంగా ఉంది. ఈ క్రమంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు గతేడాది 2.76 శాతంతో పోలిస్తే 1.96 శాతానికి తగ్గాయి. అలాగే నికర నిరర్థక ఆస్తులు తగ్గి 0.41 శాతానికి చేరుకున్నాయి.
బుధవారం ట్రేడింగ్ సెషన్లో యాక్సిస్ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 1.46 శాతం లాభపడి రూ.976.85 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఏడాది ప్రాతిపదికన డిపాజిట్లు 17 శాతం పెరగగా.. ఇందులో సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 22 శాతం పెరిగాయి. అలాగే కరెంట్ ఖాతా డిపాజిట్లు 23 శాతం పెరిగాయి. టర్మ్ డిపాజిట్లు 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దేశీయ నికర రుణాలు 26 శాతం పెరగడంతో బ్యాంక్ అడ్వాన్స్‌లు ఏడాది ప్రాతిపదికన 22 శాతం పెరిగి రూ.8.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ రుణాలు 21 శాతం పెరిగి రూ.4.97 లక్షల కోట్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications