ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశీయ, విదేశీ సంస్థలు వేల కోట్ల రూపాయల మేర పెట్టబడులు పెట్టాయి ఈ సంస్థలో. తాజాగా మరో ఒక బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులను పెట్టడానికి ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ ఆసక్తి చూపుతోంది.
దీనికోసం రిలయన్స్ యాజమాన్యంతో సంప్రదింపులను నిర్వహిస్తోంది. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతం మేర వాటాలను విక్రయించడానికి సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో.. వాటిని కొనుగోలు చేయడానికి సిల్వర్ లేక్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. రిటైల్ విభాగంలో రిలయన్స్ యాజమాన్యానికి 57 బిలియన్ డాలర్ల మేర వాటాలు ఉన్నాయి. ఇందులో 10 శాతం మేర పెట్టుబడుల కోసం రిలయన్స్ యాజమాన్యం వ్యూహాత్మక భాగస్వామ్యులు, ఈక్విటీ ఇన్వెస్టర్లతో సంప్రదింపులను నిర్వహిస్తోంది.

ఈ వాటాల కొనుగోలుపై సిల్వర్ లేక్ ఆసక్తిగా ఉందని, ఒక బిలియన్ డాటర్లన ఇన్వెస్ట్ చేయడానికి చర్చలు నిర్వహిస్తోందని కార్పొరేట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దేశీయ రిటైల్ రంగంలో అడుగు పెట్టిన రిలయన్స్ అంచనాలకు అనుగుణంగా విజయాలను అందుకుంది. రిటైల్ రంగంలో అవకాశాలు భారీగా ఉండటాన్ని పసిగట్టిన రిలయన్స్ యాజమాన్యం ఈ రంగంలో కాలు మోపింది. ఇప్పటికే జియోతో దేశీయ టెలికం రంగంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తోంది.
చమురు, సహజవాయు రంగంలోనూ అదే దూకుడును కొనసాగిస్తోంది. కొద్దిరోజుల కిందటే 24 వేల కోట్ల రూపాయలతో తన రిటైల్ సామ్రజ్యాన్ని మరింత విస్తృతం చేసుకుంది. ఫ్యూచర్ గ్రూపును రిలయన్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్‌బుక్ సహా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇప్పటికే పలు దేశీయ, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అదే పరిస్థితి కొనసాగే అవకాశాలు లేకపోలేదు. సిల్వర్ లేక్ నిర్వహిస్తోన్న చర్చలు దాదాపుగా సఫలం కావచ్చని కార్పొరేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications