తప్పనిసరి పరిస్థితుల్లో నగదు ముద్రణ, లాభార్జన కాదు: దువ్వూరి సుబ్బారావు
ముంబై: కేంద్ర బ్యాంకు నగదును ముద్రించి ప్రభుత్వానికి ఆర్థిక మద్దతు ఇవ్వవచ్చునని, అయితే ఇది తప్పని పరిస్థితుల్లోనే ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నగదును ముద్రించాలని, తద్వారా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలని పలువురు ఆర్థికవేత్తలు సూచించారు. ఈ నేపథ్యంలో దువ్వూరి సుబ్బారావు స్పందించారు. నగదు ముద్రించాలని, కానీ తప్పని పరిస్థితుల్లో మాత్రమే అది ఉండాలన్నారు. ఆర్థిక పునరుద్ధణకు దానిని ఆఖరి అస్త్రంగా మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

కోవిడ్ బాండ్స్
ఆర్బీఐ నగదును ప్రత్యక్షంగా ముద్రించి ప్రభుత్వానికి ద్రవ్యపర మద్దతు అందించవచ్చునని దువ్వూరి పేర్కొన్నారు. కానీ ప్రత్యామ్నాయంలేని పరిస్థితుల్లోనే ప్రత్యక్ష నగదు ముద్రణ విధానం అవలంభించాలని స్పష్టం చేశారు. ఈ తరహా పరిస్థితిని భారత్ ఎప్పుడు ఎదుర్కోలేదన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ బాండ్స్ జారీఅంశాన్ని కేంద్రం పరిశీలించవచ్చునని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం కరోనా బాండ్స్ జారీ ద్వారా రుణ సమీకరణను పరిశీలించాలని సూచించారు. బడ్జెట్‌లో పేర్కొన్న రుణ సమీకరణ ప్రణాళికకు అదనంగా కోవిడ్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణగా దీనిని పరిగణించవచ్చు.

ఆకర్షణీయంగా బాండ్స్
మార్కెట్ సమీకరణలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు కోవిడ్ బాండ్స్ జారీ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం మంచి నిర్ణయమేనని సుబ్బారావు అన్నారు. వ్యవస్థలో ప్రస్తుతమున్న వడ్డీరేట్లకు స్వల్పంగా అదనపు వడ్డీ ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లను కోవిడ్ బాండ్స్ వైపు ఆకట్టుకునే అవకాశం ఉందన్నారు. నగదు సరఫరా, ఆర్బీఐ ద్రవ్య లభ్యత చర్యలకు వీటి వల్ల అవరోధం ఉండదన్నారు. లాభాలు ఆర్బీఐ లక్ష్యంగా ఉండరాదన్నారు.

లాభాలు లక్ష్యం కాదు
ఆర్బీఐ వాణిజ్య సంస్థ కాదని, లాభాల ఆర్జన ఉద్దేశం కాదన్నారు. అయితే, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భాగంగా ఆర్బీఐ కొంత ఆర్జిస్తుందని, ఖర్చులు తీర్చుకోవడంతో పాటు నగదు నిల్వలు పెంచుకోవడానికి అందులో కొంత వాటాను అట్టిపెట్టుకొని, అదనపు లాభాలను ప్రభుత్వానికి బదలీ చేస్తుందన్నారు. అంతేకానీ లాభార్జన ప్రధాన ఉద్దేశ్యం కారాదన్నారు.


Click it and Unblock the Notifications