మరో బాదుడుకు రెడీ అవ్వండి: మందుల ధరల మోత: పారాసిటమాల్ సహా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి ధరల కొరడా ఝుళిపించడానికి రెడీ అయింది. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల ధరల మోత మోగించింది. ఒక్కో సిలిండర్ రీఫిల్లింగ్‌పై 50 రూపాయల అదనపు భారాన్ని మోపింది. పెట్రోల్, డీజిల్ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పేరుతో ఇంధన రేట్లను భారీగా పెంచుకుంటూ పోతోంది. అయిదు రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి.
ఈ నాలుగు దఫాల్లోనూ కేంద్ర ప్రభుత్వం లీటర్‌పై 80 పైసల చొప్పున పెంచుకుంటూ పోయింది. మొత్తంగా వాహనదారులు లీటర్‌పై రూ.3.20 పైసలను అధికంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం మరో బాదుడుకు సిద్ధపడింది. అదే- మెడిసిన్స్. మందులపై ఈ దఫా ధరల భారాన్ని మోపనుంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే 800 రకాల మందులపై వడ్డనకు రంగం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఒక్కో రకం మెడిసిన్‌పై ఎంత లేదనుకున్నా 10 శాతం మేర ధరల పెంచనుంది. దీనికి అవసరమైన అనుమతులను కూడా నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) మంజూరు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అత్యవసర మెడిసిన్స్‌పై కనీసం 10.7 శాతం అధిక ధరలను కొనుగోలుదారులను చెల్లించాల్సి ఉంటుంది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ 2021 క్యాలెండర్ ఇయర్‌లో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా మెడిసిన్స్ ధరలను పెంచాల్సి వచ్చిందని ఎన్‌పీపీఏ తెలిపింది.
జ్వరం తగ్గించడానికి వినియోగించే పారాసిటమాల్ సహా దాదాపు అన్ని రకాల మందుల ధరలు ఇక ప్రియం కానున్నాయి. ఇన్ఫెక్షన్లను నివారించడం, చర్మవ్యాధుల కోసం వాడే ఔషధాలు, గుండె జబ్బులు, అనీమియా, హై బ్లడ్ ప్రెషర్.. వంటి మెడిసిన్స్ ధరలు 10 శాతానికి పైగా పెరగనున్నాయి. అజిత్రోమైసిన్, సిప్రోఫ్లొక్సాసిన్ హైడ్రోక్లోరైడ, మెట్రోనిడేజోల్, పారాసిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనైటోయిన్ సోడియం వంటి మందుల ధరల్లో పెరుగుదల చోటు చేసుకోనుంది.


Click it and Unblock the Notifications