LPG cylinder price: రూ.25 పెరిగిన ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధర
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుండి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ధరలను సవరించాయి. నాన్-సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు రూ.25 పెంచాయి. నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడు రూ.884.50కు పెరిగింది. గత రెండు వారాల్లో ఇది రెండో పెరుగుదల. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన, 15వ తేదీన సవరిస్తాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
అంతకుముందు ఆగస్ట్ 18వ తేదీన గ్యాస్ ధరలు రూ.25 పెరిగాయి. అంతకంటే ముందు జూలై 1వ తేదీన ధర రూ.25.50 పెరిగింది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో రూ.884.50, కోల్‌కతాలో రూ.911, ముంబైలో రూ.884.5, చెన్నైలో రూ.900.5కు పెరిగింది. ఇక 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.75 పెరిగి రూ.1693కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12 సిలిండర్లను సబ్సిడీ పైన అందిస్తుంది.

ఇదిలా ఉండగా, పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం(సెప్టెంబర్ 1) స్వల్పంగా తగ్గాయి. నేడు పెట్రోల్ 10 పైసల నుండి 15 పైసల వరకు తగ్గింది. నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు అంతకుముందు ఆదివారం తగ్గాయి. డీజిల్ ధరలు ఇటీవల పలుమార్లు తగ్గాయి. 35 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధర పది రోజుల క్రితం 15 పైసల నుండి 20 పైసలు తగ్గింది. ఇటీవల పలుమార్లు తగ్గిన డీజిల్ ధరలు గత ఆదివారం 18 పైసల నుండి 20 పైసల మధ్య తగ్గింది. ఇటీవలి వరకు నెల రోజులకు పైగా ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications