మీ మంత్లీ బడ్జెట్ తలకిందులు కాబోతోందా? ఆ రెండు వస్తువుల ధరల పెంపుతో సామాన్యుడికి డబుల్ షాక్!
ఇప్పటికే పెరిగిన ఎండలతో అల్లాడిపోతున్న సామాన్యుడిపై ధరల భారం మరింతగా పడనుంది. దేశంలో ఒకేసారి ఇంధన ధరలు , పాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) జూన్ నెల నుండి ఏకంగా 40 నుండి 50 బేసిస్ పాయింట్ల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 పెంచగా, దానికి ముందే సీఎన్‌జీ (CNG) ధర కిలోకు రూ. 2 పెరిగింది. ఇదే సమయంలో దేశంలోనే అతిపెద్ద పాల బ్రాండ్లు అయిన అమూల్ (Amul), మదర్ డెయిరీ (Mother Dairy) సైతం లీటర్ పాలపై రూ. 2 చొప్పున పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ వరుస ధరల పెంపు (Price hike) నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా సామాన్యుడి మంత్లీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.

జూన్ నెలలో అసలు ప్రభావం.. నిపుణుల లెక్కలు ఇవే!
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ICRA) చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ ప్రకారం.. ఈ ఇంధన ధరల పెంపు వల్ల సగటు వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 25 బేసిస్ పాయింట్లు పెరగవచ్చు. మే నెల మధ్యలో ఈ ధరల పెంపు జరగడం వల్ల, దీని పూర్తి ప్రభావం జూన్ నెల సీపీఐ (CPI) గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. మే నెల ద్రవ్యోల్బణం అంచనాను సైతం ఆమె 4.1 శాతం నుండి 4.3 శాతానికి సవరించారు.
కొత్త సీపీఐ సిరీస్ ప్రకారం.. ఇంధనం , వెలుతురు (Fuel and light) విభాగానికి 5.5 శాతం వెయిటేజీ ఉంది. నెలవారీ గృహ వినియోగ డేటాను పరిశీలిస్తే.. పట్టణాల్లో నివసించే కుటుంబాలు తమ నెలవారీ బడ్జెట్‌లో దాదాపు 7 శాతాన్ని పాలకు, 5.5 శాతాన్ని ఇంధనం , వెలుతురు కోసం ఖర్చు చేస్తున్నాయి.
రవాణా, ఈ-కామర్స్ రంగాలు ఖరీదు.. పాల ధరలదే ఎక్కువ ఇంపాక్ట్!
ఇండియా రేటింగ్స్ డైరెక్టర్ మేఘా అరోరా ప్రకారం.. పాలు , ఇంధన ధరల ఉమ్మడి ప్రభావం వల్ల ద్రవ్యోల్బణం సుమారు 42 బేసిస్ పాయింట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, దీని పరోక్ష ప్రభావం (Pass-through effect) మరింత ఎక్కువగా ఉంటుందని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా రంగానికి, గూడ్స్ ఫ్రైట్, ఈ-కామర్స్ డెలివరీలు, కోస్తా తీర ప్రాంతాల్లో బోట్లను నడిపే మత్స్యకారులు , ఆక్వా రైతులకు ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఈ పరోక్ష ప్రభావం వల్లే ద్రవ్యోల్బణం మరో 15 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని తెలిపారు.
అయితే, ఇంధనం కంటే పాల ధరల పెంపు వల్లే ద్రవ్యోల్బణానికి ఎక్కువ ముప్పు ఉందని అరోరా విశ్లేషించారు. పశువుల మేత, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం వల్లే పాల కంపెనీలు ధరలను పెంచాల్సి వచ్చింది. దీనివల్ల సీపీఐ ఇండెక్స్ ఏకంగా 26 బేసిస్ పాయింట్లు పెరగనుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గనుక ఇలాగే 100 డాలర్ల పైనే కొనసాగితే.. మున్ముందు చమురు సంస్థల నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం మరిన్ని ధరల పెంపులకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
డిమాండ్ తగ్గే అవకాశం ఉందంటున్న డీబీఎస్ బ్యాంక్!
డీబీఎస్ (DBS) బ్యాంక్ సీనియర్ ఎకనమిస్ట్ రాధికా రావు ప్రకారం.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా పెరగడం వల్ల మార్కెట్‌లో ఇంధన వినియోగం , డిమాండ్ కొంత మేర తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల దేశంపై ముడిచమురు దిగుమతుల భారం కొద్దిగా తగ్గుతుంది. అయినప్పటికీ, సీపీఐ బాస్కెట్‌లో పెట్రోల్, డీజిల్‌కు ఉన్న వెయిటేజీ కారణంగా, 3 నుండి 5 శాతం ధరల పెంపు నేరుగా హెడ్‌లైన్ ద్రవ్యోల్బణానికి 15 నుండి 25 బేసిస్ పాయింట్లు అదనంగా జోడిస్తుందని, దీని సెకండ్ రౌండ్ ఎఫెక్ట్ మార్కెట్లోని మిగతా వస్తువులపై కూడా పడుతుందని ఆమె స్పష్టం చేశారు. మొత్తానికి ఈ సరికొత్త ధరల పెంపు (Price hike) రాబోయే రోజుల్లో మధ్యతరగతి ప్రజల జేబులకు మరింత చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications