తాతలు, తల్లిదండ్రులు ఇచ్చే సంపాదన చూసి విర్రవీగుతూ ఆస్తులను నాశనం చేసుకునేవారు కొందరు ఉన్నారు. అయితే స్వయం శక్తితో వినూత్న ఆలోచనలు పెట్టుబడిగా ఎదిగేవారు మరికొందరు. దేశ విదేశాలు తిరిగి సమాజంలోని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించడం, దాని ఆధారంగా ఏ వ్యాపారం అయితే లాభసాటిగా ఉంటుందోనని అన్ని విధాలుగా ఆలోచించి సక్సెస్ అయిన వ్యాపారవేత్తలు ఎందరో. ఇలా విజయం సాధించిన వారు యువతకు ప్రేరణగా నిలుస్తారు.
చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటారు. లాయర్, డాక్టర్, పోలీస్ అంటూ వృత్తులు చెబుతున్నారు కానీ వ్యాపారం చేస్తానని చెప్పేవారి సంఖ్య తక్కువ. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం కోసం చూస్తున్నారే తప్ప సొంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచన చాలామందికి ఉండటం లేదు. కానీ ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి అనే వ్యక్తి రోటీన్‌కి కాస్త భిన్నంగా ఆలోచించారు. దీంతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.

ప్రతీక్ సూరి పాఠశాల విద్యాభ్యాసం ఢిల్లీలోనే సాగింది. అనంతరం 2006లో బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివేందుకు దుబాయ్ వెళ్లారు. అక్కడ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వందల మందితో కలిసి చదువు పూర్తి చేశారు. అక్కడే గ్లోబల్ కమ్యూనిటీలో ఎదిగేందుకు కొన్న అపారమైన అవకాశాలను గుర్తించారు. అదే దీక్షతో 2012లో 'మాసర్' అనే కంపెనీ స్థాపించి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారీ చేయడం మొదలుపెట్టారు.
అతి తక్కువ కాలంలోనే ఆయన బిజినెస్ ఆఫ్రికా మార్కెట్‌కు కూడా విస్తరించింది. కంపెనీ తయారు చేసిన స్మార్ట్ టీవీకి మంచి ఆదరణ లభించింది. ఏకంగా 8 లక్షలు యూనిట్లు అమ్ముడుపోయాయి. రెట్టించిన ఉత్సాహంతో మరోసారి వేసిన ముందడుగు ఇంకోసారి సక్సెస్ తెచ్చిపెట్టింది. ఆఫ్రికాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్ చేశారు. అది కూడా ఫలించడంతో కంపెనీ మరింత పురోగతి సాధించింది. 2023 నాటికి ఆయన సంపద విలువ 15 వేల 780 కోట్లు.


Click it and Unblock the Notifications