Electricity: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో విద్యుత్ వాడకమూ తారాస్థాయికి చేరుతోంది. 2022-23లో విద్యుత్ వినియోగం 9.5 శాతం వృద్ధి చెంది 1,503.65 బిలియన్ యూనిట్లకు చేరింది. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) డేటా ప్రకారం, 2021-22లో కరెంటు వాడకం 1,374.02 బిలియన్ యూనిట్లు(BU) మాత్రమే.
క్రితం రెండేళ్లను పోల్చి చూస్తే, విద్యుత్ వినియోగం సుమారు 150 BUలు పెరిగిందన్నమాట. ఒక రోజులో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ సైతం గత ఆర్థిక సంవత్సరంలోనే 207.23 GWగా నమోదైంది. 2021-22లో ఇది 200.53 GW మాత్రమే ఉంది. అయితే 2023-24లో విద్యుత్ వినియోగం మరియు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుతుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

డిమాండ్ కు తగిన విధంగా సప్లయి పెంచేందుకు, పూర్తి సామర్థ్యంతో బొగ్గు ఆధారిత ప్లాంట్లను నడపాలని వివిధ రాష్ట్రాలను విద్యుత్ శాఖ ఆదేశించింది. ఈసారి వినియోగం ఎక్కువగా ఉండనుందన్న అంచనాల నేపథ్యంలో.. అవసరమైన మేరకు బొగ్గును సైతం దిగుమతి చేసుకోవాలని సూచించింది. కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో విద్యుత్ డిమాండ్ ఎక్కువైనట్లు నిపుణులు తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో దేశంలో విస్తారంగా వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సమయంలో వాడకం 128.47 BU నుంచి 126.21 BUకి పడిపోయింది. ఒకవేళ గతనెలలో వర్షాలు లేకుంటే ప్రస్తుత వినియోగం, 2022-23లో వాడకానికి రెండింతలుగా ఉండేదని అంచనా. 2021-22 ఏడాది మొత్తం వినియోగం 1374.02 BUలను, గత ఆర్థిక సంవత్సరం ఓ నెల మిగిలి ఉండగానే వాడేశారు. 2023-24లో మాత్రం కరెంటు వాడకంలో రెండంకెల వృద్ధి ఏర్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications